ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన లీడర్లలో అసంతృప్తి

  • పార్టీ మారినా  ఫాయిదా లేకపాయే.. 
  • ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన లీడర్లలో అసంతృప్తి
  • ఎమ్మెల్సీలు కౌశిక్ రెడ్డి, ఎల్.రమణకు మాత్రమే పదవులు 
  • ఆరేపల్లి, కోడూరి, చల్మెడ, సంతోష్ కుమార్ కు దక్కని గుర్తింపు 
  • ఎలక్షన్లు దగ్గర పడుతున్నా పట్టించుకోని హైకమాండ్​
  • వచ్చే ఎన్నికల్లో టికెట్లు,  నామినేటెడ్​ పోస్టులపై ఆశలు 
  • లేదంటే ఇతర పార్టీల్లోకి  జంప్  అయ్యే చాన్స్​

కరీంనగర్, వెలుగు:  అధికార పార్టీలో చేరితే ఏదో ఒక పదవి వస్తుందని ఆశించిన లీడర్లకు నిరాశే మిగిలింది. పార్టీ మారినా వారికి ఫాయిదా లేకుండా పోయింది. ఏదో ఒక రోజు పదవి వస్తుందని ఎదురుచూస్తూ నాలుగేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా బీఆర్ఎస్​ హైకమాండ్​ తమను పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ లో చేరిన లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొందరు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తుండగా.. మరికొందరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే భరోసాతో ఉన్నారు. తమను ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఎన్నికల్లోపే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

బలమైన లీడర్లకూ గుర్తింపు లేదు..

అధికార పార్టీలో చేరినవారిలో చాలామంది బలమైన లీడర్లున్నారు. గతంలో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో కొనసాగినవారున్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, 2009లో  కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున రెండు సార్లు పోటీ చేసిన చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పనిచేసిన సంతోష్ కుమార్ తదితరులు 2018 ఎన్నికలకు ముందు,  తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. వీరికి ఆయా నియోజకవర్గాల్లో బలమైన లీడర్లుగా గుర్తింపు ఉంది. వీరంతా ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా, స్థానిక సంస్థల కోటాలో వీరికి చాన్స్ రాలేదు. చల్మెడ లక్ష్మీనర్సింహారావు తొలుత కరీంనగర్ నుంచే రెండుసార్లు పోటీ చేసినప్పటికీ.. తన స్వగ్రామం మలకపేట వేములవాడ నియోజకవర్గంలో ఉండడంతో ఆయన కొంతకాలంగా అదే నియోజకవర్గంపై దృష్టిసారించారు. కానీ చెన్నమనేని రమేశ్‌బాబు కోర్టు కేసు తేలకపోవడం, వచ్చే ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీనర్సింహారావు మళ్లీ కరీంనగర్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ అధికార పార్టీ టికెట్​ఇవ్వకపోతే అవకాశమొస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీది అదే పరిస్థితి.. 

మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ అధికార పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లోనూ వారికి కనీసం మాట్లాడే అవకాశం దక్కలేదు. చొప్పదండి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో సత్యనారాయణ గౌడ్ కు అక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టును ఆశించారు. కానీ ఆయనకు ఎలాంటి పదవి దక్కకపోగా.. పార్టీలో ఆయన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే ఐదేళ్లలో ఎలాంటి పదవి రానందున ఆరెపల్లి మోహన్ మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. లేదంటే మరో పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  కౌన్సిల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగిన టి. సంతోష్ కుమార్ 2018 ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరారు. అదే టైంలో మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఫలితంగా కౌన్సిల్ లో కాంగ్రెస్ గుర్తింపు రద్దయింది. ఇంతచేసినా సంతోష్ కుమార్ కు ఆతర్వాత ఎలాంటి పదవులు రాలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయం చూసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఏదైనా పార్టీ నుంచి గానీ, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని తెలుస్తోంది. 

ఇద్దరికే పదవులు..

బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించిన హుజురాబాద్ ఎన్నికల టైంలో ఎక్కువ సంఖ్యలో ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్. రమణ బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ జిల్లాలో ఇలా ఆలస్యంగా బీఆర్ఎస్ లో చేరిన వీరిద్దరికి మాత్రమే ఎమ్మెల్సీ పదవులు వరించాయి. కౌశిక్ రెడ్డికి మండలిలో విప్ పదవి కూడా  దక్కింది. వారి కన్నా ముందే జాయిన్ అయిన లీడర్లకు మాత్రం ఇప్పటివరకు సరైన గుర్తింపు దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.