పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న లోక్ సభ స్థానాల్లో మెదక్ సీటు ఒకటి హాట్ సీటు. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఇది కంచుకోట. తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచి బీఆర్ఎస్ ఇక్కడ గెలుస్తోంది. 2009లో టీఆర్ఎస్ నుంచి విజయశాంతి, 2014లో మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలిచారు. మళ్లీ ఉప ఎన్నికల్లోనూ, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. కానీ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క మెదక్ తప్ప..మిగతా ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ సిద్దిపేట నుంచి హరీశ్ రావు, గజ్వేల్ నుంచి కేసీఆర్, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు.
మెదక్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్నా ప్రస్తుతం లోక్ సభకు పోటీ చేసేందుకు ఎవర్ని బరిలోకి దింపాలనేదానిపై అధిష్టానం తర్జనాభర్జనలో పడింది. లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనుకుంటున్న స్థానాన్ని ఎలాగైనా వదులుకోవద్దని బీఆర్ఎస్ చూస్తోంది. కాంగ్రెస్ నుంచి నీలం మధు పేరు వినిపిస్తోంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మెదక్ లోక్ సభకు ఇటీవల వెంకట్రామిరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు తెరపైకి వచ్చాయి.
ALSO READ :- పార్టీ మారే ఆలోచన మానుకున్న బాబురావు
అయితే లేటెస్ట్ గా మెదక్ బరిలో హరీశ్ రావు లేదా కేసీఆర్ పోటీచేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. కీలక నేతలు బరిలో దిగితే ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీశ్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తే పార్టీ క్యాడర్ లో జోష్ వస్తుందంటున్నారు నేతలు. కేసీఆర్ కూడా హరీశ్ ను పోటీ చేసేందుకు మొగ్గుచూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి మెదక్ నుంచి గులాబీ బాస్ ఎవర్ని బరిలోకి దింపుతారో చూడాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.