గద్వాల, వెలుగు : గద్వాల బీఆర్ఎస్ లీడర్లు తెలంగాణ ఆర్టీసీ బస్సును కాదని, కర్నాటక ఆర్టీసీ బస్సును కిరాయికి తీసుకొని హైదరాబాద్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ భవన్ లో బుధవారం బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనికి గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య లీడర్లు బస్సులో తరలివెళ్లారు. గద్వాల ఆర్టీసీ డిపోలో బస్సులున్నప్పటికీ కర్నాటకలోని రాయచూర్ డిపోకు చెందిన బస్సును అద్దెకు తీసుకున్నారు.
అసలు విషయం ఇదీ...
కర్నాటకతో పోలిస్తే తెలంగాణలో డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల బస్సు అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే కర్నాటక బస్సును కిరాయికి తీసుకున్నామని బీఆర్ఎస్ లీడర్లు చెప్పారు. కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.87.86 కాగా మన రాష్ట్రంలో రూ.99.55 ఉంది. తెలంగాణతో పోలిస్తే కర్ణాటకలో రూ.11.64 తక్కువగా ఉండడంతో అక్కడి బస్సు బుక్ చేసుకుంటే రూ.5 వేల వరకు తగ్గే అవకాశం ఉండడంతో అటు వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది.