చీమలపాడు ఘటనలో ఇల్లు కోల్పోయిన కుటుంబం ఆవేదన

  • ఇల్లు బూడిదైనా..ఒక్క రూపాయీ ఇవ్వలే
  • చీమలపాడు ఘటనలో ఇల్లు కోల్పోయిన కుటుంబం ఆవేదన
  • ఇప్పటి వరకు సాయమందించని బీఆర్​ఎస్ ​నేతలు
  • మృతులకు, గాయపడిన వారికి మాత్రమే పరిహారం
  • సర్కారు ఆదుకోవాలని  బాధితుల వేడుకోలు

ఖమ్మం/ కారేపల్లి, వెలుగు:   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  చీమలపాడు ఘటనలో  ఇల్లు కోల్పోయిన బాధితుడికి  ఎలాంటి  భరోసా దక్కలేదు.  ఖమ్మం జిల్లా కారేపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా  కాల్చిన  పటాకులతో బుధవారం చీమలపాడులో గుడిసె కాలిబూడిదైన విషయం తెలిసిందే.  ఆ మంటలతో గుడిసెలో ఉన్న గ్యాస్​ సిలిండర్​ పేలి ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు.  మరో నలుగురు ఒక్కో కాలు కోల్పోయి,  హెల్త్​ కండీషన్​ సీరియస్​గా ఉండడంతో హైదరాబాద్​లోని నిమ్స్​లో  చికిత్స పొందుతున్నారు.  ఈ ఘటనలో చనిపోయిన,  గాయపడిన బాధితులకు బీఆర్​ఎస్​ నేతలు పరిహారం ప్రకటించారు.  మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి  రూ.2 లక్షల చొప్పున స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్​, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్​ చేతుల మీదుగా పరిహారాన్ని అందించారు.  కానీ గుడిసెకు నిప్పంటుకోవడంతో ఆ ఇంటిని కోల్పోయిన జక్కుల రాములును మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉన్న గుడిసె పూర్తిగా కాలిపోవడంతో ఊళ్లు తిరుగుతూ డోలు వాయించుకుంటూ, భిక్షాటన చేసుకుంటూ ఉపాధి పొందుతున్న రాములుకు నిల్వ నీడ కూడా లేకుండా పోయింది.

బతుకుదెరువు కోసం వచ్చి..

ఏన్కూరు మండలం రాజలింగాలకు  చెందిన జక్కుల రాములు కుటుంబం ఎనిమిదేండ్ల కింద చీమలపాడుకు వచ్చింది. ప్రభుత్వ బడిని ఆనుకుని ఉన్న  కొద్దిపాటి సర్కార్​ జాగాలోనే గుడిసె  వేసుకొని జీవిస్తున్నారు. రాజన్నల కుటుంబానికి చెందిన రాములు తమకు సంప్రదాయంగా వస్తున్న వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాడు.  చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ,  డోలు వాయించుకుంటూ భిక్షాటన చేసుకుంటూ వచ్చిన పైసలతో జీవిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య చనిపోవడం, రాములుకు కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం సంపాదన కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పన్నెండేళ్ల కుమారుడితో కలిసి భిక్షాటన కోసం ఈనెల మొదటివారంలో వెళ్లగా, బుధవారం సిలిండర్​ పేలుడు ఘటన జరిగింది. చీమలపాడులోనే ఉన్న రాములు తమ్ముడు కొమురయ్య సమాచారం ఇవ్వడంతో రెండు రోజుల కింద కుమారుడు ప్రవీణ్ తో కలిసి రాములు చీమలపాడు వచ్చాడు. ఇంట్లో దాచుకున్న వస్తువులు, తన భార్యకు సంబంధించిన ఆనవాళ్లు సహా సర్వస్వం మంటల్లో కాలిపోవడంతో  కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తమ్ముడు కోటయ్య ఇంట్లోనే రాములు, ప్రవీణ్​ తలదాచుకుంటున్నారు. 

లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోవట్లే..

సిలిండర్​ పేలుడు ఘటన తర్వాత బీఆర్ఎస్​ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని మంత్రి అజయ్​ ప్రకటించారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ కూడా సొంతంగా  చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని చెప్పారు. రెండు రోజుల కింద రమేశ్​​, మంగ్యా అలియాస్​ మంగు, లక్ష్మణ్​ కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున అందజేశారు. కానీ తమ కుటుంబాన్ని బీఆర్ఎస్​ నేతలు గానీ,  ఆఫీసర్లు గానీ పట్టించుకోవడం లేదని రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తన వంతు సాయంగా రూ.10వేలు ఇచ్చాడని చెబుతున్నాడు. తమకు కనీసం డబుల్ బెడ్​ రూం ఇల్లు  ఇప్పించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని రాములు కోరుతున్నాడు.  

సర్వం కోల్పోయినం.. 

పటాకులు పేలిన నిప్పురవ్వలతో  మా గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదైనయ్​. డోలు కొట్టుకుంటూ ఊరూరా తిరుగుతూ పొట్టగడుపుకుంటున్నాం. తమ తాతల కాలం నుంచి రాజన్నల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాం.   గుడిసె కాలిపోయి నిలువనీడ లేకుండా  పోయింది. ప్రభుత్వం మమ్ములను ఆదుకోవాలి.

జక్కుల రాములు, బాధితుడు, చీమలపాడు 

అమ్మ గుర్తులన్నీ కాలిపోయినయ్​..

అనారోగ్యంతో మా అమ్మ రెండేళ్ల కింద చనిపోయింది. అమ్మ గుర్తుగా పట్టీలు, కొన్ని బట్టలు బీరువాలో ఉంచుకున్న. మా గుడిసె కాలిపోయి అమ్మ  గుర్తులన్నీ బూడిదయ్యాయి. ఇంటిని కోల్పోయి, మా నాన్న నేను వీధిన పడ్డాం.
- జక్కుల ప్రవీణ్, రాములు కుమారుడు