బీఆర్ఎస్ నేతల పక్క చూపులు .. జడ్పీ, డీసీసీబీ, బల్దియా చైర్మన్లు పార్టీ మారేందుకు రెడీ! 

  • అదే దారిలో సెకండ్ క్యాడర్ లీడర్లు
  • ఇప్పటికే కాంగ్రెస్​లోకి పలువురు ప్రజాప్రతినిధులు
  • పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ సైలెన్స్

ఆదిలాబాద్, వెలుగు: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లీడర్లు పార్టీ మారుతున్నారు. మరికొందరు కూడా జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. వాంకిడి మండలం చౌపన్ గుడా సర్పంచ్ సిడం అన్నిగా ఈ నెల 15న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, ముథోల్ మండలం రాంటెక్ ఎంపీటీసీ ఆత్మ స్వరూప్ బీఆర్ఎస్ ను వీడి మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఇదిలా ఉండగా, అదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్​తో పాటు డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, సెకండ్ కేడర్ లీడర్లు పార్టీ మారబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధమవుతుండగా బీఆర్ఎస్ మాత్రం ఇంకా సైలెంట్​గానే ఉంది. సీనియర్ లీడర్లు పార్టీ మారేందుకు ప్రయత్నాలు జరుపుతుండటంతో వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ కు సమస్యగా మారుతాయనే చర్చ జరుగుతోంది. 

బీఆర్​ఎస్​లో ఆందోళన

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం రెండు సీట్లు గెలిచిన బీఆర్ఎస్​కు వచ్చే వరుస ఎన్నికలు సవాల్​గా మారనున్నాయి. మరోపక్క అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తొలుత సర్పంచ్​ ఎన్నికలు వస్తుండటంతో చాలా గ్రామాల్లోని ప్రస్తుత సర్పంచులతో పాటు ఆశావహులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అవిశ్వాస సెగలు రేగుతూ ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ కు ఆయా శాఖల చైర్మన్లు పార్టీ వీడేందుకు సిద్ధమవుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. 

‘చేతి’ వైపు చైర్మన్ల చూపు

జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీ కాలం మరో ఐదు నెలల్లో పూర్తి కానుంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​లో చేరితే తమ పదవులకు ఢోకా లేదనే ఉద్దేశంతో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ అది నెరవేరలేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, తన అనచురులతో చర్చించిన తర్వాత పార్టీ మార్పుపై వెల్లడిస్తానని ఆయన ‘వెలుగు’తో చెప్పారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్ సీనియర్ లీడర్ జోగు రామన్న ప్రధాన అనుచరుడు తమ పార్టీలో చేరుతున్నారంటూ కాంగ్రెస్ లీడర్ గోవర్ధన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం హాట్ టాపిక్​గా మారింది. దీంతో అడ్డిబోజారెడ్డి బీఆర్ఎస్​ను వీడుతారనే ప్రచారం ఊపందుకుంది.

మరికొన్ని చోట్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు, సెకండ్ క్యాడర్‌‌‌‌‌‌‌‌ లీడర్లు కూడా కాంగ్రెస్, లేదా బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఆ రెండు పార్టీల లీడర్లతో టచ్​లో ఉంటూ తాము పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని, అవకాశం ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజేందర్​తో పాటు పలువురు కౌన్సిర్లు బీఆర్ఎస్ ను వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది జంప్​అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

లోక్​సభ ఎన్నికలపై  కనిపించని ఉత్సాహం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో జోష్ వచ్చింది.నాలుగేసి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ విజయం సాధించడంతో పదేండ్ల తర్వాత ఆ పార్టీలు సత్తా చాటాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకోగా.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​తో పాటు రామగుండం,మంథని, పెద్దపల్లి, ధర్మపురి సెగ్మెంట్లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి ఊపులో ఉంది.

ఈ క్రమంలోనే మరికొద్ది నెలల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జిగా మంత్రి సీతక్కను నియమించగా, పెద్దపల్లి బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించింది. బీజేపీ సైతం జోరు పెంచింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, లీడర్లతో రాష్ట్ర ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్​ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఆ రెండు పార్టీలు నేతలతో చర్చలు జరుపుతున్నా బీఆర్ఎస్ మాత్రం సైలెంట్​గా ఉంది