నీళ్లియ్యనోళ్లకు ఓటు అడిగే హక్కు లేదు: ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డి

కోదాడ, వెలుగు: నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లివ్వని బీఆర్‌‌ఎస్‌ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  సోమవారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బజ్జురి వెంకట్ రెడ్డి బీఆర్‌‌ఎస్‌కు రాజీనామా చేసి ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ..  కాంగ్రెస్ హయాంలో సాగర్‌‌ డెడ్‌ స్టోరేజీలో ఉన్నా ప్రణాళిక ప్రకారం నీళ్లు వదిలి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. 

 ప్రస్తుతం కాల్వల కింద పంటలు ఎండిపోతున్నా..  బీఆర్‌‌ఎస్‌ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  అధికార పార్టీ ఎమ్మెల్యేలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రతి నియోజకవర్గంలో  సాండ్, లాండ్, మైన్, వైన్ దందాల్లో వాళ్లదే కీలక పాత్ర అని ఆరోపించారు. దళితబంధు స్కీమ్‌లో 70 శాతం కమీషన్లకు పోతుందని, లబ్ధిదారులను 30శాతం మాత్రమే దక్కుతుందన్నారు. తాను, తన సతీమణి 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ అవినీతికి పాల్పడలేదనన్నారు. వచ్చే ఎన్నికల్లో  కోదాడలో కాంగ్రెస్‌కు 50వేల  మెజారిటీ వస్తోందని ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, కీత వెంకటేశ్వర్లు, పిండ్రాతి హనుమంత్ రావు పాల్గొన్నారు.