- భూరికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో వెలుగులోకి అక్రమాలు
- ఇప్పటికే 280 ఎకరాలు వాపస్, పట్టాలు రద్దు
- బీఆర్ఎస్ లీడర్లు, ఆనాటి ఆఫీసర్లపై కేసులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు:పదేండ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కార్ భూములకు పట్టాలు పొందిన లీడర్ల వ్యవహారాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రెవెన్యూ ఆఫీసర్లు, నాటి సర్కార్ పెద్దలు కుమ్మక్కయి బీఆర్ఎస్ లీడర్లకు సుమారు 2 వేల ఎకరాల వరకు భూసంతర్పణ చేయడం, ఇప్పుడు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించి అందులో 280 ఎకరాలను స్వాధీనం చేసుకుని, పట్టాలను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇందులో ఒక్క తంగళ్లపల్లి మండలంలోనే 950 ఎకరాల సర్కార్ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టి, లావణి పట్టాలు జారీ చేసినట్టు రెవెన్యూ స్పెషల్ టీమ్ జరిపిన విచారణలో తేలిందని తెలిసింది. తాజాగా సర్కార్ భూములను చెరబట్టిన వారిపై కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తుండడం, వారిని జైలుకు పంపుతుండడంతో అక్రమంగా పట్టాలు పొందినవారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రికార్డులు తారుమారు..
2017లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ భూరికార్డుల ప్రక్షా ళన చేపట్టింది. ఇదే అదనుగా రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కయి.. 2018, 2019 సంవత్సరాల్లో వందలాది ఎకరాల సర్కార్ భూములను బీఆర్ఎస్ లీడర్లు తమ పేర్లపైకి మార్చుకుని లావణి పట్టాలు పొందారు. కోట్లా ది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొందరు చెరబడితే.. మరికొందరు కేవలం రైతుబంధు డబ్బుల కోసమే వ్యవసాయ యోగ్యం కాని భూములు, గుట్టల కు పట్టాలు పొందారు. సంపన్నులైన లీడర్లు పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని పీఓటీ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. తమ పేరిట పాస్ బుక్స్ సంపాదించారు.
కలెక్టర్ చొరవతో వెలుగులోకి..
అధికారంలో ఉన్నప్పుడు సర్కార్ భూములపైగా లావణి పట్టాలు పొందిన బీఆర్ఎస్ లీడర్ల అక్రమాలపై కొద్ది రోజులుగా కలెక్టర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ భూదందాపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ ఆఫీసర్లతో ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. అక్రమంగా లావణి పట్టాలు పొందినట్టు నిర్ధారణకు వచ్చిన వెంటనే అక్రమార్కుల పేర్లు తొలగించి.. వాటిని గవర్నమెంట్ ల్యాండ్స్ గా మార్చేస్తున్నారు. మరోవైపు అక్రమాలకు పాల్పడిన లీడర్లు, వారికి సహకరించిన ఆఫీసర్లపై కేసులు నమోదు చేయిస్తున్నారు.
అక్రమాల్లో మచ్చుకు కొన్ని...
ఇప్పటి వరకు జిల్లాలో 280 ఎకరాల భూమిని రెవెన్యూ ఆఫీసర్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొందరు అక్రమంగా పట్టా చేసుకున్న భూములకు సంబంధించిన పాస్ బుక్స్ ను స్వచ్ఛందంగా కలెక్టర్ కు అప్పజెప్పారు.
తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ మిట్టపల్లి పద్మ ఇదే మండలం తాడూరు రెవెన్యూ పరిధిలో 545/1/13/1 సర్వే నంబర్ లో 2 ఎకరాలపై పొందిన పట్టా పాసు పుస్తకాలను కలెక్టర్ కు వాపస్ చేశారు. ఈ భూమి ద్వారా పొందిన రైతు బంధు పైసలు కూడా కలెక్టర్‌కు సరెండర్ చేస్తామని చెప్పారు.
తంగళ్లపల్లి మండలం తాడూరు పరిధి 1148 సర్వే నంబర్ లోని వేర్వేరు బై నంబర్లలో సురభి నవీన్ రావు పేరిట 3 ఎకరాలు, సురభి దేవేందర్ రావు పేరిట 3 ఎకరాలు, సురభి సుధాకర్ రావు పేరిట 5 ఎకరాలు మొత్తం 11 ఎకరాలు అక్రమంగా పట్టా చేసుకున్నట్టు తేలింది. వీరిలో సురభి నవీన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ధరణి పోర్టల్ లో ఈ ముగ్గురి పేర్లను తొలగించి 11 ఎకరాలను ఆఫీసర్లు గవర్నమెంట్ ల్యాండ్స్ గా మార్చేశారు.
సర్దాపూర్ లో, బద్నేపల్లిలోని వివిధ సర్వే నంబర్లలో 7 ఎకరాల సర్కార్ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొల్లి రామ్మోహన్ తో అరెస్టుల పర్వం మొదలైంది.
సిరిసిల్ల టౌన్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్ జిందం దేవదాస్ తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో మూడెకరాల సర్కార్ భూమిపై లావుణీ పట్టా పొందారు. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, రెవెన్యూ ఆఫీసర్లు ఆ భూమిని వాపస్ తీసుకున్నారు.
సర్దాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ లీడర్ అగ్గిరాములు తండ్రి ఒజ్జల వెంకటి పేరిట సర్వే నంబర్ 61/28లోని ఐదెకరాల సర్కార్ భూమికి లావణి పట్టా జారీ చేశారు. అలాగే రాములు పేరిట 63, 69 సర్వే నంబర్లలో మరో 20 గుంటల మేర లావణి పట్టా జారీ చేశారు. ఈ అక్రమాలపై రెవెన్యూ ఆఫీసర్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదుచేసి రాములును జైలుకు పంపారు.
ALSO READ : పాలమూరు–రంగారెడ్డి పనులు స్పీడప్ చేయాలి : ఇరిగేషన్ ఆఫీసర్లు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్‌లో 36 గుంటల భూమిని కొందరు నాయకులు కబ్జా చేశారు. కబ్జాచేసిన భూమిని కొంత కాలానికి పట్టా చేసుకున్నా రు. అక్రమంగా పట్టా చేసినందుకు అప్పటి సిరిసిల్ల తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్ లాల్‌పై కేసు నమోదైంది.
తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో 164/3 సర్వే నంబర్లో 3 ఎకరాల సర్కార్ భూమిని సిరిసిల్ల టౌన్ కు చెందిన ముఖ్య నాయకుడి తమ్ముడు జిందం దేవదాసు స్థానిక తహసీల్దార్ సహకారంతో అక్రమంగా పట్టా చేసుకున్నాడు. దీంతో తంగళ్లపల్లి తహసీల్దార్ సదానందం పై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు దేవదాసును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ధరణి పోర్టల్ లో దేవదాసు పేరు తొలగించి గవర్నమెంట్ ల్యాండ్స్ గా మార్చేశారు.
తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో బీఆర్ఎస్ లీడర్ బండి దేవదాస్... సర్వేనంబర్ 374లో 3.25 ఎకరాల సర్కార్ భూమిపై లావణి పట్టా పొందారు. ఇదే గ్రామంలో కోడూరి భాస్కర్ 20 గుంటల సర్కార్ భూమిపై లావణి పట్టా పొందారు.
అక్రమ పట్టాదారులు భూమి వెనక్కి ఇవ్వాలి..
ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో కేసులు నమోదు చేశాం. అక్రమంగా పట్టా చేసుకున్న ప్రభుత్వ భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలి. స్వచ్ఛందంగా అప్పగించిన భూములను తిరిగి పేదల సంక్షేమానికి వినియోగిస్తాం. మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రెండెకరాల భూమిని తిరిగి అప్పజెప్పటం అభినందనీయం. అక్రమంగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉంటూ రైతుబంధు లాంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన సొమ్మును రికవరీ చేయడానికి డిమాండ్ నోటీసులు జారీ చేస్తాం.
- సందీప్‌కుమార్ ఝా, కలెక్టర్, రాజన్న సిరిసిల్ల జిల్లా