అభివృద్ధి పనులను ప్రారంభించిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు..ధ్వంసం చేసిన కాంగ్రెస్‌‌ నాయకులు

తొర్రూరు, వెలుగు : గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ప్రారంభించగా, ఎమ్మెల్యే లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ కాంగ్రెస్‌‌ లీడర్లు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలలో బుధవారం జరిగింది. గ్రామంలో నిర్మించిన మిషన్‌‌ భగీరథ వాటర్‌‌ ట్యాంక్‌‌ను, లైబ్రరీని బుధవారం సర్పంచ్‌‌ రావుల మమత, ఎంపీటీసీ గోపమ్మ, ఉపసర్పంచ్‌‌ రాజు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌‌ నాయకులు కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చి ‘ఎమ్మెల్యే లేకుండా అభివృద్ధి పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ శిలాఫలకాలను ధ్వంసం చేశారు.

అనంతరం సర్పంచ్‌‌ మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించామని, ఎంత సేపు వెయిట్‌‌ చేసినా ఎమ్మెల్యే రాకపోవడం వల్లే తాము ప్రారంభించామని చెప్పారు. ప్రజలకు అవసరమైన పనులు చేస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. అనంతరం శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డితో పాటు కలెక్టర్‌‌, ఎస్పీకి సమాచారం ఇచ్చామని సర్పంచ్‌‌ చెప్పారు.