పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇయ్యలే :పట్నం నరేందర్​ రెడ్డి

  • రిమాండ్​ రిపోర్టులోని అంశాలు అవాస్తవం
  • మెజిస్ట్రేట్​కు జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్
  • బెయిల్​పై విచారణ 18కి వాయిదా​

హైదరాబాద్​, వెలుగు: పోలీసుల ముందు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి తెలిపారు. ‘‘కేటీఆర్​ చెప్పడంతోనే లగచర్లలో అధికారులపై దాడులు చేయించామని రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్న అంశాలు అవాస్తవం. కేటీఆర్​ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని నేను ఎక్కడా ఎవరికీ చెప్పలేదు. నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్​ రిపోర్టు తప్పు. అసలు రిమాండ్ రిపోర్టులో ఏముందో కూడా నాకు తెలియదు. నా అడ్వకేట్ల ద్వారా రిమాండ్​ రిపోర్టును చూస్తేనే అందులో ఏముందో తెలిసింది. నేను చెప్పని అంశాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా కోట్ చేస్తూ ఫేక్ రిమాండ్​ రిపోర్టును తయారు చేశారు” అని గురువారం ఆయన చర్లపల్లి జైలు నుంచి అడ్వకేట్ల ద్వారా తన అఫిడ విట్​ను కొడంగల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్​కు పం పించారు.

బుధవారం తాను కేబీఆర్ పార్కులో మార్నింగ్​ వాక్​ చేస్తుండగా ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలీసులు మఫ్టీలో వచ్చి బలవంతంగా తనను తీసుకెళ్లారని అందులో పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పారని, ఆ తర్వాత పోలీసులెవరూ తనతో మాట్లాడలేదని, విచారణ కూడా చేయలేదని తెలిపారు. అలాంటప్పుడు తానెలా కన్ఫెషన్​ స్టేట్​మెంట్​ ఇస్తానని నరేందర్​రెడ్డి ప్రశ్నిం చారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని రిమాండ్​ రిపోర్టుపై తగిన ఆదేశాలు ఇవ్వాలని మెజిస్ట్రేట్​ను కోరారు. 

రిమాండ్‌‌ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టుకు.. 

వికారాబాద్‌‌ జిల్లా కొడంగల్‌‌ కోర్టు జారీ చేసిన రిమాండ్‌‌ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ బీఆర్ఎస్​ నేత పట్నం నరేందర్‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టిన అధికారులపై లగచర్ల గ్రామస్తులు చేసిన దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు. దురుద్దేశంతో, రాజకీయ ప్రేరేపితంగా కేసు నమోదు చేశారన్నారు.

లగచర్ల కేసులో అరెస్టయినోళ్లకు ఉచిత న్యాయ సాయం: బీఆర్​ఎస్​

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కోర్టులో బీఆర్ఎస్ లీగల్ టీం పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్​ కోసం గురువారం పిటిషన్ వేసింది. విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ మెంబర్, అడ్వకేట్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతోనే పిటిషన్ వేసినట్టు చెప్పారు. లగచర్ల దాడి కేసులో అరెస్టయిన వారికి బీఆర్ఎస్ లీగల్ సెల్ తరపున ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు.