రుణమాఫీ సర్జికల్ స్ట్రైక్​తో బీఆర్ఎస్ కకావికలం!

రుణమాఫీ సర్జికల్ స్ట్రైక్​తో బీఆర్ఎస్ కకావికలం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అంచనా వేసినంత సాధారణ మనిషి కాదని తెలియడానికి బీఆర్ఎస్ నాయకులకు ఎంతో సమయం పట్టలేదు.

బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు..  

1. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ కబ్జాలు, దందాలు బయటపడతాయన్న ఆందోళన. 
2. రేవంత్ రెడ్డిని హింసించినందుకు అంతకు రెట్టింపు పగ సాధిస్తారన్న భయం. 
3. తమ ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి అవతరించగలరని, ముఖ్యమంత్రి అవుతారని ఊహించకపోవడం. 
4. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు సీఎం అయితే తమ పప్పులుడికేవని భావించడం. 
5. కేసీఆర్​కు మించిన రాజకీయ ఎత్తులతో రేవంత్ రెడ్డి కార్యాచరణ మొదలుపెట్టడం. 

కాగా,  రేవంత్ రెడ్డి రెండు విషయాల్లో బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడవేశారు. ఇందులో ప్రధానమైనది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ అమలుచేయడం. తర్వాత 'హైడ్రా' సంస్థ ఏర్పాటుచేసి చెరువులు చెరబట్టినవారి ఆటకట్టించడం. బీఆర్ఎస్  వర్కింగ్​ ప్రెసిడెంట్ విలేకరుల సమావేశాలు నిర్వహించి ఎంత కంఠశోష పెట్టినా ప్రజలు విశ్వసించడం లేదు. కారణం ఫామ్ హౌస్​ల సంస్కృతి!  ఢిల్లీ, హర్యానా, యూపీ, కర్నాటక,  మహారాష్ట్ర వంటి చోట్ల  అత్యంత  సంపన్నులు,  సినీ తారలు, సెలెబ్రిటీల ఫామ్ హౌస్​ల గురించి గతంలో మాట్లాడుకుంటూ ఉండేవారు.  

ఆయా రాష్ట్రాలకు మించి తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్​ సంస్కృతి విస్తరించింది.  రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు, మీడియా యాజమాన్యాలు,  ఐఏఎస్,  ఐపీఎస్ అధికారులు ఫామ్ హౌస్​లు ఏర్పాటు  చేసుకోవడం, సెలవుల్లో,  ఖాళీ సమయాల్లో విందులు ఉధృతమయ్యాయి. ఇక మరోవైపు  డ్రగ్స్ మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ 'నడమంత్రపు సిరి' కార్యకలాపాలు, 'నయా విష సంస్కృతి'  ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి విజృంభించడం చారిత్రక విషాదం!  తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకు డిమాండ్ చేశామో,  ఎందుకు సాధించామో,  వచ్చిన తెలంగాణ ఎవరి పాలయ్యిందో?  అది వేరే చర్చ!

అప్పుల ఊబిలో రైతులు 

కేసీఆర్ పత్రిక 'విపక్షాలకు ఇది మాస్టర్ స్ట్రోక్' అంటూ  పతాకశీర్షిక పెట్టింది.  కానీ, రుణమాఫీ జరగనందున రైతుల అకౌంట్లను ఫ్రీజ్ చేసి 'రైతు బంధు' డబ్బులను వడ్డీ కింద బ్యాంకులు జమచేసుకున్నవి. 2023లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మితే పౌర సరఫరాల సంస్థ బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా ఆ సొమ్మును బ్యాంకులు రైతుల బాకీ కింద జమ చేసుకున్నవి. ఏళ్ల తరబడి రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు తమకు తోచిన పద్ధతుల్లో  రైతులను పీడించి వసూళ్లు చేశాయి. 

2023 జూన్ నాటికి రైతుల అప్పు 1,12,492 కోట్లు.  దేశంలోనే  రోల్ మోడల్ గా  చెప్పుకున్న 'రైతుబంధు' అమలుచేసినా.. తెలంగాణ రైతులు ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు?   ఇందుకు బాధ్యులెవరు?. కొన్ని రియల్ ఎస్టేట్  ముఠాలు, బూటకపు మేధావులు, కేసీఆర్ వల్ల అనేక విధాలుగా లబ్ధిపొందిన 'గులాబీ రంగు' పూసుకున్న కవులు, కళాకారులు, రచయితలు తెలంగాణ 'జాతిపిత'గా  కేసీఆర్ ను భజన చేస్తూ వచ్చారు.  

కేసీఆర్ ను  దైవాంశ సంభూతుడన్నారు.  చావు నోట్లోకి పోయి  కేసీఆర్  తెలంగాణ తీసుకొచ్చారన్న  నిత్య ప్రచారం 2014 నుంచి ఎలాగూ ఉన్నదే!  'రైతు బంధు' వలన రైతులకు  ఒనగూరిన ప్రయోజనం ఎలాగున్నా కేసీఆర్ 'రహస్య ఎజెండా' వేరు!  భూస్వాములకు, జూబ్లీహిల్స్ లో  నివసించే సంపన్నులకు,  రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఫామ్ హౌస్ లకు,  వ్యవసాయం చేయనివారికి,  అనర్హులకు  ప్రజాధనాన్ని  పప్పు బెల్లాలవలె పంచి పెట్టారు.  రైతుబంధు ముఖ్య ఉద్దేశం  రైతుకు పంట పెట్టుబడి సహాయం అందించడం. ఈ పథకం దుర్వినియోగమైంది. 

'రైతుబంధు' పేరిట కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయం

అసలు రైతులకన్నా పెట్టుబడిదారులు, ధనబలం పుష్కలంగా ఉన్నవారు లబ్ధి పొందారు.  సాగు చేయని లేదా సాగుకు యోగ్యంగా లేని భూములు,  కొండలు, గుట్టలకు చివరకు రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు అమలు చేశారు. పచ్చిగా చెప్పాలంటే 'రైతుబంధు' పేరిట కేసీఆర్ వ్యూహాత్మకంగా 'ఓటు బ్యాంక్' రాజకీయం నడిపారు.  అదేవిధంగా 'రైతుబంధు' పేరిట కేసీఆర్ ప్రభుత్వం 80,440 కోట్లు పంపిణీ చేసింది.  అర్హులైన రైతులకు మాత్రమే అందేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం  'రైతుభరోసా'ను డిజైను చేసింది. ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి ఏటా 15,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకుగాను కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.  జిల్లాల్లో  పర్యటిస్తూ  'రైతుభరోసా’ పై  రైతులు,  వ్యవసాయ రంగ నిపుణులు, మేధావుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.  గతంలో  కేసీఆర్ హయాంలో 'ప్రజాభిప్రాయ' సేకరణ అర్ధంలేని విషయం.   కేసీఆర్  ఏం చెపితే  అదే జీవో.  దాన్ని అధికారగణం  అమలు చేసింది.  మరో మాట లేదు. మరో సూచన లేదు. మరొకరి సలహా అవసరం లేదు. 'రైతు బడి', 'ఇరిగేషన్ బడి', మరొక బడి.. ఏదైనా సరే ఆయనే హెడ్ మాస్టర్.  తాము రైతుల కోసం చేసింది ఈ దేశంలోనే ఎవరూ చేయలేదని  కేసీఆర్ అండ్ కో  ఎంత డబ్బా కొట్టుకున్నా వాస్తవాలు వేరనేది నగ్నసత్యం.  

7.50 లక్షల కోట్ల అప్పుల్లో  తెలంగాణ 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి తెలంగాణ 7.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. ఈ పరిస్థితిలో రుణమాఫీ వ్యవహారం అత్యంత సాహసోపేత నిర్ణయంగా భావించాలి.  రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మొత్తం కేబినెట్ సమష్టిగా  నిర్ణయం తీసుకొని రుణమాఫీ అమలు చేస్తున్నారు.  రుణమాఫీ విషయంలో సీఎంకు, మంత్రులకు మధ్య పొరపొచ్చాలు తీసుకురావాలన్న ఎత్తుగడకు బీఆర్ఎస్ పాల్పడుతోంది.  

రుణమాఫీ వ్యవహారం తమ పార్టీని ఇరకాటంలో పెడుతున్నదనే ఉద్దేశంతో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కేసీఆర్ పార్టీయే ప్రజల్లో  అభాసుపాలవుతోంది.  'ఒక పామును మీరు కాలితో తొక్కి.. వదిలేశారు. అప్పుడది  రెండింతలు కసితో తలెత్తి మిమ్మల్ని కాటు వేస్తుంది.  ప్రాణాలతో వదిలిపెట్టిన శత్రువు సగం చచ్చిన పాము లాంటివాడు. ప్రత్యర్థి పామును తిరిగి కోలుకోనిస్తే కాలం గడచిన కొద్దీ దాని విషం మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుచేత పూర్తిగా అణచివెయ్యాలి' అని రాజకీయ తత్వవేత్త మాకియవెల్లి అన్నాడు.  ఈ 'కోట్' ను  రాజకీయంగా పరిపూర్ణంగా అమలు చెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కనపడుతోంది.


బీఆర్ఎస్​కు రేవంత్​ షాక్

'రైతుల రుణమాఫీ' పేరిట రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్ చేస్తారని షాక్​కు గురైన బీఆర్ఎస్ ఊహించలేదు.  రైతుల పట్ల తమకున్న ప్రేమ మరొకరికి లేదని,  దేశవ్యాప్తంగా రైతుల కోసం తాము ప్రవేశపెట్టిన పథకాలే  రోల్ మోడల్ అని పదేండ్లు ఊదరగొట్టారు.  ఇందుకుగాను  ప్రచారానికే  వందల కోట్లు ప్రజల సొమ్ము  ఖర్చు పెట్టారు.  కేసీఆర్ ప్రభుత్వం అసలేమీ చెయ్యలేదని కాదు.  

కానీ, చేసింది గోరంత అయితే కొండంత ప్రచారం  సాగించారు. 2014లో  కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదేండ్లలో నాలుగు విడతల్లో వడ్డీలు చెల్లిస్తామంటూ ప్రకటనలు గుప్పించి, వాయిదాలు వేస్తూ వచ్చి రైతులను, వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి  కేసీఆర్ ప్రభుత్వం నెట్టివేసింది.  రుణమాఫీ విషయంలో  విపరీతమైన కాలయాపన చేసి ఎన్నికలు సమీపించిన వేళ 2023 ఆగస్టులో రుణమాఫీపై  కేసీఆర్ హామీ ఇచ్చారు.  నెలన్నరలో రుణమాఫీ చేస్తామని ఇందుకోసం 19 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు. పైగా దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునివ్వడం, ఊరు వాడా బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 2014 నుంచి 2023 డిసెంబరు వరకు కనిపించిన దృశ్యాలు రెండే. ఒకటి.. పాదాభివందనం. రెండు.. పాలాభిషేకం!

కేసీఆర్ హయాంలో.. 8వేల మంది రైతుల ఆత్మహత్యలు

రైతుల ఆదాయంలో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉన్నది.  కేసీఆర్ హయాంలో పదేండ్లలో తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నవి.  'రైతు ప్రభుత్వమంటే రైతులు చనిపోకుండా చూడాలి.  చనిపోయాక వారికి పరిహారం ఇచ్చే ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుంది?' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. 'రాష్ట్రంలో సాగునీటి కాల్వల ద్వారా కోటి ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, 2014 లో  19 లక్షల పంపుసెట్లు ఉండగా,  ఇప్పుడు 29 లక్షలకు  పంపు సెట్ల సంఖ్య ఎందుకు పెరుగుతుంది' అని  కూడా సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 

కాగా,  2022 మే 6న వరంగల్ లో  రాహుల్ గాంధీ ప్రకటించిన 'రైతు డిక్లరేషన్' లో భాగంగా  రైతుల రుణమాఫీని మూడు దశల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. అయితే, సాంకేతికంగా తలెత్తే కొన్ని సమస్యలు, ఇతర అంశాల వల్ల కొందరు రైతులకు ఇంకా రుణమాఫీ అమలు జరగడంలో జాప్యం జరగవచ్చు. కానీ, రాష్ట్రంలో ప్రతి రైతుకూ రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని చర్యలూ తీసుకుంటున్నది. 

- ఎస్.కె. జకీర్,
సీనియర్ జర్నలిస్ట్​