పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్ల స్కామ్స్‌‌

  • 17 కుంభకోణాలతో రూ.4.10 లక్షల 
  • కోట్లను బీఆర్ఎస్ దోచుకుంది: కాంగ్రెస్
  • 111 జీవో రద్దుతో రూ.1.40 లక్షల కోట్ల అవినీతి
  • కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్లు.. ధరణితో రూ.50 వేల కోట్ల దోపిడీ
  • పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.25 వేల కోట్ల స్కామ్
  • పక్కా ఆధారాలతో స్కామ్​ల వివరాలు ఇస్తున్నామని ప్రకటన

 

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో స్కామ్​లకు పాల్పడిందని, రూ.పది లక్షల కోట్లు దోచుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. అందులో 17 ముఖ్యమైన స్కామ్​లు ఇవేనంటూ వివరాలను మంగళవారం వెల్లడించింది. ఆయా కుంభకోణాల వల్ల ఎంత మంది బాధితులయ్యారో కూడా చెప్పుకొచ్చింది. ఈ 17 కుంభకోణాలతో రూ.4.10 లక్షల కోట్లకుపైగా బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించింది. 

ఇరిగేషన్ ప్రాజెక్టులు, భూములు, స్కీమ్​ల పేరుతో ప్రజల నుంచి లక్షలాది కోట్ల రూపాయల దోపిడీకి బీఆర్​ఎస్​ పాల్పడిందని కాంగ్రెస్​ మండిపడింది. 111 జీవోను రద్దు చేసి రూ.1.40 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని పేర్కొంది. వివిధ స్కీమ్​లు, ప్రాజెక్టుల వారీగా జరిగిన అవినీతిపై కాగ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలేనని వెల్లడించింది. ఇవన్నీ పక్కా ఆధారాలతో ఇస్తున్న స్కామ్​ల వివరాలని స్పష్టం చేసింది.

111 జీవో రద్దు

111 జీవో రద్దుతో బీఆర్ఎస్ సర్కార్ 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం పెట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది. లక్ష ఎకరాల్లోని 70 శాతం భూములు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉన్నాయని పేర్కొంది. వాటి విలువ రూ.35 వేల కోట్లు అని పేర్కొంది. మొత్తంగా జీవో రద్దు పేరుతో రూ.1.40 లక్షల కోట్ల స్కామ్‌‌‌‌కు పాల్పడిందని, దాని వల్ల 3,77,348 మంది బాధితులుగా మారారని చెప్పింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు..

‘‘ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టారు. రూ.40,300 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.1.40 లక్షల కోట్లకు పెంచారు. దాదాపు రూ.లక్ష కోట్ల అవినీతికి బీఆర్ఎస్ పాల్పడింది” అని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల 1,87,404 మంది బాధితులుగా మిగిలారని, డైరెక్ట్​గా ఎఫెక్ట్ అయినోళ్లు 70,886 మంది ఉన్నారని తెలిపింది.

ధరణి పోర్టల్..

ధరణి పోర్టల్ ద్వారా 24 లక్షల ఎకరాల ప్రైవేటు, ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ వివాదాస్పదంగా మార్చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. భూములను కబ్జా చేసేందుకే ఈ పోర్టల్​ను బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని, బీఆర్ఎస్ నేతల చేతుల్లోనే ఎక్కువ భూములున్నాయని పేర్కొంది. ఈ పోర్టల్​తో రూ.50 వేల కోట్ల అవినీతికి పాల్పడగా.. 20 లక్షల మంది బాధితులుగా ఉన్నారని వెల్లడించింది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

2013లో కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిందని, కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాజెక్టును కావాలని లేట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.32,500 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.60 వేల కోట్లకు పెంచేసిందని తెలిపింది. ఈ ప్రాజెక్టులో రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. 92,47,956 మంది బాధితులయ్యారని పేర్కొంది. 

ఓఆర్ఆర్ లీజు

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఐఆర్​బీ ఇన్​ఫ్రా అనే సంస్థకు రూ.7,380 కోట్లకే 30 ఏండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం లీజుకిచ్చిందని కాంగ్రెస్ చెప్పింది. ఇందులో రూ.22,620 కోట్ల కుంభకోణానికి బీఆర్ఎస్ పాల్పడిందని ఆరోపించింది. 3.63 కోట్ల మందిపై దీని వల్ల ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ 30 ఏండ్ల పాటు వాస్తవ ఆదాయం రూ.30 వేల కోట్లు రావాల్సి ఉంటే.. అత్యంత చీప్​గా కట్టబెట్టారని మండిపడింది.

ఏఎంఆర్ మైనింగ్​కు తాడిచర్ల బొగ్గు బ్లాక్ అప్పగింత

తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని 2011లో నాటి సీఎం రోశయ్య లెటర్ రాశారని, కానీ సింగరేణి తీసుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. బీఆర్ఎస్ సర్కారు, టీఎస్ జెన్​కోలు కలిసి ఆ బొగ్గు బ్లాకును 30 ఏండ్ల లీజుకు ఏఎంఆర్ మైనింగ్ కంపెనీకి అప్పగించాయని విమర్శించింది. 80 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నా.. కేవలం 49.73 లక్షల టన్నుల నిక్షేపాలే ఉన్నాయంటూ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొంది. తద్వారా రూ.16 వేల కోట్ల స్కామ్‌‌‌‌కు పాల్పడిందని, రాష్ట్ర ప్రజలందరిపై దాని భారం పడిందని చెప్పుకొచ్చింది.

హరితహారం

హరితహారం ప్రాజెక్టులో భాగంగా కొన్న మొక్కలకు అసలు ధర కన్నా పదింతలు కోట్ చేస్తూ బిల్లులు వసూలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. 70 శాతం నిధులను లూటీ చేశారని, రూ.8 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. మొత్తం ప్రజలందరూ ప్రభావితమయ్యారని ఆరోపించింది. 

నిషేధిత భూముల జాబితా..

వేలాది ఎకరాల భూములను 22ఏ (నిషేధిత) జాబితా నుంచి బీఆర్​ఎస్​ తొలగించిందని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. తెల్లాపూర్​లోని రూ.5 వేల కోట్ల విలువైన వంద ఎకరాల భూములను కేవలం రూ.260 కోట్లకే కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడైన ప్రతిమ శ్రీనివాస్​కు కట్టబెట్టారని తెలిపింది. దాంతో రూ.5 వేల కోట్ల స్కామ్​కు పాల్పడిందని ఆరోపించింది. 

మెడికల్​ సీట్లలోనూ కుంభకోణం

ప్రైవేట్​ మెడికల్​ కాలేజీల్లో 20 శాతం సీట్లను ఇన్‌‌‌‌స్టిట్యూషనల్​ కోటా కింద నింపాల్సి ఉంటుందని, అయితే ఒక్కో సీటును రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల దాకా అమ్ముకున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. తద్వారా రూ.3,513 కోట్ల స్కామ్​ జరగ్గా.. 94,900 మంది బాధితులుగా మారారని పేర్కొంది. 

నయీం ఆస్తుల కుంభకోణం

గ్యాంగ్​స్టర్​ నయీం మరణం తర్వాత రూ.2 వేల కోట్ల ఆస్తుల రికవరీలోనూ బీఆర్​ఎస్​ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్​ ఆరోపించింది. కేసును సీబీఐకి అప్పగించకుండా రూ.2 వేల కోట్ల స్కామ్ చేసిందని ఆరోపించింది. దీని వల్ల నయీం బాధితులకు న్యాయం జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల 53,339 మంది బాధితులుగా ఉన్నారని పేర్కొంది. 

జీహెచ్ఎంసీ హౌసింగ్​ సొసైటీ

షేక్​పేటలో లేని సర్వే నంబర్​ను సృష్టించి 32 ఎకరాల భూమిని హౌసింగ్ సొసైటీకి బీఆర్​ఎస్​ సర్కార్​ కట్టబెట్టిందని, తద్వారా రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్​ ఆరోపించింది. 

మధుకాన్​ గ్రూప్​ బ్యాంక్​ లోన్స్​ స్కామ్​

ఓ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణం కోసం మధుకాన్​ గ్రూప్​ ద్వారా ఫ్రాడ్​ బ్యాంక్​ లోన్లను తీసుకునేలా ప్రోత్సహించిందని బీఆర్​ఎస్​పై కాంగ్రెస్​ ఆరోపణలు గుప్పించింది. ప్రాజెక్టును చేపట్టకుండానే లోన్లు తీసుకుందని సీబీఐ విచారణలో తేలిందని, రూ.1,064 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పింది. 

మార్క్​ఫెడ్​ స్కామ్​..

2019లో మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోలు చేయాల్సిన మక్కలను.. రంజిత్​ రెడ్డి సంస్థ 51,150 టన్నులు, మరో సంస్థ 43,408 టన్నులను తీసుకెళ్లాయని, తద్వారా అందులో 

రూ.వెయ్యి కోట్ల స్కామ్​కు బీఆర్​ఎస్​ పాల్పడిందని పేర్కొంది. దీని ఫలితంగా 56,59,890 మంది రైతులపై ప్రభావం పడిందని ఆరోపించింది. 

లిక్కర్​ స్కామ్​..

ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో కీలకంగా వ్యవహరించి కవిత స్కామ్​కు పాల్పడ్డారని, రూ.వంద కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.

దళితబంధులో కమీషన్లు

దళితబంధు పథకంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లను దండుకుంటున్నారని, ఇప్పటివరకు 38,328 మంది కుటుంబాలకు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నదని కాంగ్రెస్​ తెలిపింది. ఈ పథకం ద్వారా రూ.1,150 కోట్ల కుంభకోణానికి సర్కార్​ పాల్పడిందని పేర్కొంది. 

మిషన్ భగీరథ

కమీషన్ల కోసమే మిషన్ భగీరథ స్కీమ్‌‌‌‌ను బీఆర్ఎస్ ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రాజెక్టు ఖర్చు రూ.100 కోట్లు దాటితే గ్లోబల్ టెండర్లను పిలవాల్సి ఉన్నా.. ఆ రూల్​ను ఫాలో కాలేదని, బీఆర్ఎస్ లీడర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని పేర్కొంది. తద్వారా రూ.21,600 కోట్ల కుంభకోణానికి సర్కారు పాల్పడిందని, 3.63 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడిందని ఆరోపించింది.

ALSO READ : మేడ్చల్ లో మెరిసేదెవరు ?.. ​ పోటా పోటీగా బీఆర్ఎస్​, కాంగ్రెస్ ప్రచారం

మిషన్​కాకతీయ

మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలో సింహభాగం చెరువులను బాగు చేయకుండానే వంద శాతం బిల్లులను డ్రా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పేరుతో చేపట్టిన మిషన్ కాకతీయ స్కీమ్​ ద్వారా 40 శాతం కమీషన్లను బీఆర్ఎస్ నేతలు దండుకున్నారని, రూ.12 వేల కోట్ల స్కామ్ చేశారని తెలిపింది. ప్రజలందరిపైనా దాని వల్ల ప్రభావం పడిందని పేర్కొంది.