నల్గొండలో మహిళా కౌన్సిలర్ పై దాడి  .. పరామర్శించేందుకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైదాడికి యత్నం 

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లాలో పొలిటికల్​హీట్​రోజురోజుకు ఎక్కువవుతోంది. ఆదివారం నల్గొండ మున్సిపాలిటీలోని మహిళా కౌన్సిలర్ పై ఔట్​సోర్సింగ్ సిబ్బంది దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్​నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. 15 రోజుల కింద బీఆర్ఎస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో 16వ వార్డు కౌన్సిలర్​జెర్రిపోతుల అశ్వినీ భాస్కర్​గౌడ్​కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్​ఉద్యోగిగా పనిచేస్తున్న అన్వర్ ఇటీవల అధికార పార్టీ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నాడని స్థానికులు సి–విజిల్​యాప్​ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి పక్కన పెట్టారు. తనపై కక్షగట్టి ఇలా చేసిందనే అనుమానంతో అన్వర్ ఆదివారం తన తల్లి నసీమ, తండ్రి మీరా హుస్సేన్​తో కలిసి కౌన్సిలర్​ఇంటిపై దాడి చేశారు. కౌన్సిలర్​అశ్వినీని బయటికి లాకొచ్చి కొట్టారు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం అశ్వినీ మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ భవిష్యత్ మీద దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి ప్రోత్బలంతోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. దాడి విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అశ్వినీని కలిసి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అదే టైంలో అక్కడికి చేరుకున్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అతని అనుచరులు వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

బూతులు తిడుతూనే దాడికి యత్నించారు. అయినప్పటికీ కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్​రెడ్డి, సీఐలు పీఎన్​డి. ప్రసాద్, సత్యనారాయణ, డానియేల్, ఎస్సైలు, సిబ్బంది భారీగా అక్కడికి చేరుకున్నారు. బీజేపీ శ్రేణులను పంపించి వేశారు. అయితే ఉద్యోగం నుంచి తొలగించారనే బాధతో గల్లీలో తిట్టుకొంటూ పోతుంటే కౌన్సిలర్​అశ్వినీనే తమపై దాడి చేసి కొట్టిందని అన్వర్ ఆరోపించాడు. తనపై జరిగిన దాడి మైనార్టీలపై జరిగినట్లు అని, మైనార్టీలు ఎవరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓట్లు వేయొద్దని చెప్పాడు. 

 ALSO READ :  సునక్ కేబినెట్​లోకి మాజీ ప్రధాని