- అన్ని చోట్లా కాంగ్రెస్, బీజేపీలకు పెరిగిన ఓట్ షేర్
- త్వరలో జరిగే స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్పై ఎఫెక్ట్
మహబూబ్‌నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు నడిచింది. ఫైనల్‌గా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజీ అన్ని నియోజకవర్గాల్లోనూ పడిపోయింది.
పుంజుకున్న కాంగ్రెస్..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు. 2014 ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ పడిపోయింది. పైగా 2018లో మక్తల్, మహబూబ్‌నగర్ స్థానాలను అలయెన్స్‌లో భాగంగా టీడీపీకి ఇచ్చారు. దీంతో ఈ రెండు స్థానాల నుంచి పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరూ బరిలో దిగలేదు. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీకి అనూహ్యంగా ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది. 2018 ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 3.92 శాతం ఓట్లు పోల్ కాగా, ఈసారి రికార్డు స్థాయిలో 46.31శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
మహబూబ్‌నగర్‌లో ఈ ఎన్నికల్లో 48.08 శాతం, జడ్చర్లలో గత ఎన్నికల్లో 30.85 శాతం ఉండగా.. ఈసారి 50.03%, దేవరకద్రలో గతంలో 34.91 శాతం ఉండగా ఈసారి 45.31 శాతం, మక్తల్‌లో ఈసారి 39.88 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఓట్ల పర్సంటేజీ పెరగడంతో పాటు ఈ ఐదు అసెంబ్లీలను కాంగ్రెస్ ‘హస్త’గతం చేసుకుంది.
బీజేపీకి పెరిగిన ఓటింగ్..
ఈ ఎన్నికల్లో బీజేపీకి నారాయణపేట నియోజకవర్గం మినహా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో బీజేపీకి నారాయణపేట అసెంబ్లీలో 12.43 శాతం ఓట్లు పోల్ అవగా, ఈ సారి 8.24 శాతానికి పడిపోయింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీలో బీజేపీకి ఏడు శాతం ఓటింగ్ పెరిగింది. నిరుడు ఎన్నికల్లో 3,72 శాతం ఉండగా, ఈసారి 10.97 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. జడ్చర్లలో గతంలో 2.24 శాతం ఓట్లు పోల్ అవగా, ఈసారి 4.05 శాతానికి పెరిగింది.
దేవకరద్రలో నిరుడు 2.97 శాతం ఓట్లు పోల్ అవగా.. ఈసారి 6.74 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మక్తల్‌లో నిరుడు 12.24 శాతం ఓట్లు పోల్ అవగా, ఈసారి రికార్డు స్థాయిలో 24.01 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీ బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
బీఆర్ఎస్కు పడిపోయిన ఓటింగ్ పర్సెంటేజ్..
నారాయణపేట అసెంబ్లీ మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల పర్సంటేజీ గణనీయంగా పడిపోయింది. గత ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో బీఆర్ఎస్కు 42.25 శాతం ఓట్లు పోల్ అవగా, ఈ ఎన్నికల్లో 1.98 శాతం ఓట్లు తగ్గి 40.97 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో గత ఎన్నికల్లో 54.16 శాతం ఓట్లు పోల్ అవగా ఈసారి 37.72 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
జడ్చర్లలో గతంలో 58.95 శాతం ఓట్లు పోల్ అవగా ఈసారి 41.9 శాతానికి పడిపోయింది. దేవరకద్రలో గతంలో 55.12 శాతం రాగా, ఈసారి 44.6 శాతం, మక్తల్‌లో గతంలో 47.77 శాతానికి గాను ఈసారి 30.55 శాతం ఓట్లు మత్రమే పోల్ అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్‌లో 16.44 శాతం, జడ్చర్లలో 17.05 శాతం, దేవరకద్రలో 10.52 శాతం, అత్యధికంగా మక్తల్‌లో 17.22 శాతం ఓట్లు తగ్గిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో ప్రభావం..
కాంగ్రెస్, బీజేపీలకు ఓటింగ్ పర్సంటేజీ పెరగడంతో వచ్చే ఏడాది జరిగే గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం పడిపోవడం, ఇప్పటికే ఈ పార్టీలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఫండ్స్ లేక నిరుత్సాహంలో ఉండడంతో రానున్న ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీల హవా కొనసాగే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధానంగా మున్సిపాల్టీలు, మండలాల్లో జరిగిన భూ దందాలు, ప్లాట్ల కబ్జాలు వంటి ఆరోపణలే కావడంతో రానున్న ఎన్నికల్లోనూ ఓటర్ల నుంచి ఇదే తరహా తీర్చు ఉంటుందనే చర్చ నడుస్తోంది.