- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత విమర్శలు
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం సంచలనం సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మహేష్ మళ్లీ ఎమ్మెల్యే గా గెలుపొందితే నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పూడూరు మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు బాలమణి విమర్శించారు. ఈ కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి మన్నేగూడలో ఎమ్మెల్యే చేపట్టిన పల్లెబాట రసాబాసగా మారింది. ఎమ్మెల్యే తమ గ్రామాలకు రావద్దంటూ కొందరు గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్నాయకులకు గ్రామస్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళా నేత బాలమణిపై సైతం సొంత పార్టీనేతలే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సమస్యలు చెబుతామని వెళ్లగా ఓ బీఆర్ఎస్నేత తనపై చెయ్యి చేసుకోబోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'మహిళలు ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పవద్దా.. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంత లేకుంటే ఎంత?' అంటూ ఆగ్రహించారు. రసాబాస నడుమే పల్లెబాట కార్యక్రమం జరిగింది.