జనగామ, వెలుగు : కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు, కడగండ్లే మిగులుతాయని బీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి సోమవారం జనగామ మండలంలోని గానుగుపహాడ్, ఎర్రకుంటతండా, యశ్వంతాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గుజరాత్ నుంచి అమిత్‌షా వచ్చినా, ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ వచ్చినా, అమేథి నుంచి ప్రియాంక గాంధీ వచ్చినా తెలంగాణకి బాద్‌షా సీఎం కేసీఆరే అని అన్నారు.
24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్‌ఎస్ కావాలో, మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పారు. ఎన్నికలప్పుడే కనబడే కాంగ్రెస్ లీడర్లను నమ్మి ఆగం కావొద్దని సూచించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌ను దీవించే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. జనగామ ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బచ్చన్నపేటతో పాటు పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువత భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో ఎన్నికలు ఏకపక్షమే అన్న ధీమా కలుగుతోందన్నారు.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు వరంలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్సే గెలవాలన్నారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి తనను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే పల్లా గెలుపు కోరుతూ బచ్చన్నపేట మండలం తమ్మడపల్లికి చెందిన యువకులు కొమురెల్లి మల్లన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లి ముడుపులు కట్టారు.