మేలు పెద్దోళ్లకు.. మోసం పేదోళ్లకు

మేలు పెద్దోళ్లకు.. మోసం పేదోళ్లకు

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇస్తున్న హామీలు ఏమిటి? దాని మేనిఫెస్టో  ఏం చెపుతున్నది? దాని విశ్వసనీయత ఎంతనో విశ్లేషిద్దాం. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నారు. హామీ మంచిదే. అమలు ఏ విధంగా చేస్తారనేదే అనుమానం. అవసరానికి తగ్గ సన్నబియ్యం ఉత్పత్తి లేదు.  అది ఆపద మొక్కుల హామీ కానుందా తెలియదు.

రాష్ట్రంలో తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎస్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా కల్పిస్తామంటున్నారు. ఇది చాలాకాలంగా మేము డిమాండ్ చేస్తున్న అంశం. మేనిఫెస్టోలో పెట్టడం స్వాగతించాలి. కేవలం భూమి ఉన్న రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇలాంటి బీమా అమలు చేసి ధీమా ఇవ్వడం అవసరమే.  అయితే కుటుంబ పెద్ద అని కాకుండా, కుటుంబంలో 18 సంవత్సరాలు నిండి ఎవరు మరణించినా, ఆ బీమా పరిహారం అందించడం అవసరం. ఈ బీమాను సహజ మరణానికి కూడా అమలు చేయడంతోపాటు, వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచడం అవసరం. కానీ నిబంధనలు చెప్పలే.

పెన్షన్​లు

వృద్ధాప్య పెన్షన్ ​ప్రస్తుతం రూ.2,016 ఇస్తున్నారు. దీన్ని దశలవారిగా పెంచుతామంటున్నారు. మొదటి ఏట రూ. 3.016 రూపాయలకు పెంచుతామంటున్నారు. ఐదు ఏండ్లలో 5 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తున్నరు. దివ్యాంగుల పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచారు. రాబోయే ఐదేండ్లలో దశలవారీగా రూ.6,016కుపెంచుతామంటున్నారు. ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచడం అవసరమే. కానీ గత ఐదేండ్ల అనుభవం అర్హులకు నష్టం చేసేవిధంగా అమలైంది.  

రూ. 2016  ఆసరా పెన్షన్ పెంచుతూ, వయో పరిమితి పెంచుతూ  జీవో ఇచ్చినా, మొదటి నాలుగేండ్లు అమలు చేయలేదు.  ఎవరు ఎప్పుడు అర్హులైనా వెంటనే పెన్షన్ ఇచ్చేలా అమలు చేస్తే ఉపయోగం. జీవో స్పూర్తితో ఆసరా పెన్షన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కాకుండా, మళ్ళీ మేనిఫెస్టోలో పెన్షన్ మొత్తాన్ని పెంచడం కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అని అనుకోవాలి. 

రైతుబంధు దశల వారి పెంపు

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా రూ.12,000కు పెంచుతామని హామీ ఇస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా  రూ.15,000కు  పెంచుతం అని హామీ ఇస్తున్నారు.  రైతులకు నగదు బదిలీ పథకం అమలు చేయడం అవసరమే . కానీ ఈ పథకం లక్ష్యం పంట పెట్టుబడికి సాయం.  ఎవరు ఆ ఏట పంట సాగు చేస్తారో వారికి మాత్రమే సాయం చేయాలి. 

కానీ ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రభుత్వం వాస్తవ సాగుదారులకు అడ్డగోలుగా ఈ పథకాన్ని అమలు చేసింది.  వేల కోట్ల నిధుల దుర్వినియోగం చేసింది. రాష్ట్రంలో ఉన్న 22 లక్షల కౌలు రైతులు సాగుచేసే భూములకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదు. బడా భూస్వాములకు డబ్బును దోచిపెట్టింది. పోడు రైతులకు, పట్టా హక్కులు తమ పేరుతో లేని  కౌలు రైతులకు ఇంతకాలం సహాయం అందించలేదు. ఇప్పుడు  ఆ విషయం ప్రస్తావన చేయలేదు.  రాబోయే అయిదేండ్ల కాలం పూర్తి అయ్యే సమయానికి ఈ పథకం కింద ఎకరానికి 15,000 సహాయం అందిస్తామని తెలుగు మేనిఫెస్టోలో రాసిన బీఆర్​ఎస్​ పార్టీ, ఇంగ్లీషు మేనిఫెస్టోలో ఎకరానికి రూ. 16,000  అని రాసింది. ఏది నిజమో ఆ పార్టీయే వివరణ ఇవ్వాల్సి ఉంది. 


నిజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరం నుంచి ఎకరానికి రూ.15,000 రైతు బంధు అందిస్తామని కౌలు రైతులకు కూడా ఈ సహాయం చేస్తామని ప్రకటించింది. వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12,000  చెల్లిస్తామని హామీ ఇచ్చింది. బీఆర్​ఎస్​ మేనిఫెస్టోతో పోల్చినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఎక్కువ మేలు చేసేదిగా ఉంది. ఆ మేనిఫెస్టోలో రైతు కమిషన్ ఏర్పాటు, పంటలకు ధరల బోనస్ లాంటివి కూడా ఉన్నాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ దొరలకు, భూస్వాములకు, వ్యవసాయం చేయని భూ యజమానులకు, వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు పేరుతో నిధులను దోచి పెట్టడానికి సిద్ధమైంది.

ఆరోగ్యశ్రీ 

ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతుందని హామీ ఇచ్చారు. ఈ పథకం కూడా ప్రజలను మోసం చేయడానికే ప్రకటించారు. ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నప్పుడే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల, చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద పేద కుటుంబాలకు వైద్య సేవలు అందించడం లేదు . ఇప్పుడు 15 లక్షలకు పెంచుతామని హామీ ఇవ్వడం అంటే ప్రజలను ఓట్ల కోసం మోసం చేయడానికే. నిజానికి గత మేనిఫెస్టోలలో చెప్పినట్లుగా రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మెరుగు పరచలేదు. జిల్లా స్థాయిలో ఆసుపత్రులను నిర్మించలేదు. ఈ నిధులను వాటికి కేటాయిస్తే, ప్రజలకు ఉచితంగా వైద్యం అందే అవకాశం ఉంది.

పేదలకు ఇండ్ల స్థలాలు 

రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు. ఇది అత్యంత హాస్యాస్పదమైన హామీ. ప్రభుత్వ భూములను చాలా పెద్దవాళ్లకు వందల కోట్లకు అమ్ముకోవడం తప్ప, గత 10 ఏండ్లలో ఒక్కసారి కూడా పేదలకు ఇండ్ల స్థలాలు పంచలేదు. పైగా గత 10 ఏండ్లలో దరఖాస్తు చేసుకున్నవారిలో లక్ష మందికి కూడా డబుల్ బెడ్ రూమ్​ల ఇండ్లు నిర్మించలేదు. నిర్మించినవి కూడా అర్హులకు పంచలేదు. వాటిని తమ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

 తాజాగా గృహలక్ష్మి పథకానికి పెట్టిన నిబంధనలు చూశాక ఆ పథకం ఎంత గొప్పగా అమలవుతుందో మనకు తెలుసు.ఈ హామీ ఎంత మోసమో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 1973 భూ సంస్కరణల గురించి ఊసే లేదు. భూమి లేని దళితులకు, ఆదివాసీలకు మూడు ఎకరాల భూమి కొనుగోలు గురించిన ప్రస్తావన లేదు.  ధరణి విషయంలో రైతుల బాధల గురించి పట్టింపు లేదు. గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది గురించి ప్రస్తావన లేదు. సమగ్ర భూ సర్వే గురించి హామీ లేదు. అంటే ఈ  ప్రభుత్వం భూమి విషయంలో ఇప్పటివరకూ చేసిన పనులన్నీ గొప్పగా ఉన్నాయని మనల్ని నమ్మమంటున్నారు. 

ఈ ఒక్క కారణం చాలు ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి. మిత్రులారా.. రాష్ట్రంలో  కేసీఆర్ పార్టీ ఇచ్చే హామీల అమలు పట్ల అనుమానం ఒక భాగమైతే, గత 10 ఏండ్లుగా ఈ పార్టీ సాగించిన మొత్తం పాలనలో ప్రజాస్వామిక దృక్పథమే లేకపోవడం అసలు సమస్య. పాలనలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం, ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి మొర పెట్టుకునే అవకాశం లేకపోవడం ఇందులో భాగం. పైగా తమ సమస్యలపై ప్రశ్నించిన వారిని, హామీల అమలు కోరినవారిని అణచివేసే ధోరణి కూడా గత 10 ఏండ్లలో చూశాం. ఏక వ్యక్తి, నిరంకుశ పాలన జరిగే తెలంగాణలో, ఇప్పుడు ఎన్నికల హామీలకు గ్యారంటీ ఎంత? అనేది కూడా మనం తప్పకుండా ఆలోచించాల్సిన ప్రశ్న .

పేద మహిళలకు రూ.300‌‌‌‌‌‌‌‌0 భృతి 

అర్హులైన పేద మహిళలందరికీ ప్రతి నెలా రూ.3,000 జీవన భృతిని అందిస్తామని హామీ ఇచ్చారు.  మహిళల అభివృద్ధికి అవసరమే కానీ, నిధుల కొరత పేరుతో ఈ పథకం అమలు ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించింది కనుక, తానూ ఇస్తానని చెప్పుకోవడానికి, కేసీఆర్ ప్రకటించినట్లు కనిపిస్తుంది. పైగా అర్హులైన పేద మహిళలకు అనే పద బంధం చూస్తే అసలు మోసం ఇక్కడే కనపడుతుంది. ఈ సహాయం ఎంతమందికి అందిస్తారో. సహాయం అందించడానికి ఎన్ని నిబంధనలు ఎలా పెడతారో ఎవరికీ తెలియదు. ఓట్లు వేయించుకుని, గెలిచాక తీరిగ్గా అసలు విషయం బయట పెట్టవచ్చు. అందుకే గత అనుభవాల దృష్ట్యా ఈ మోసానికి రాష్ట్ర మహిళలు గురి కారనే ఆశిద్దాం.

గ్యాస్​ సిలిండర్ ​రూ.400  

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు రూ. 400కు గ్యాస్ సిలిండరును అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే తగ్గించింది. మిగిలిన సిలిండర్ ల ధర పెద్దగా తగ్గలేదు. ఈ విషయం పరిశీలిస్తే.. కేసీఆర్ పార్టీ  అర్హులైన పేద మహిళలకు అనే పద బంధం మాటున కేవలం ఉజ్వల స్కీమ్ వారికే ధర తగ్గించే అవకాశం ఉంది. ఉజ్వల పథకంలో లేని పేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ హామీని చూసి మోసపోరనే ఆశిద్దాం. పైగా గ్యాస్ సిలిండర్ కుటుంబం వాడుకుంటుంది. ఇది కేవలం మహిళలకు మేలు చేస్తుందని రాయడం పురుషాధిక్య భావజాలమే.

- కన్నెగంటి రవి, కో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్డినేటర్, తెలంగాణ పీపుల్స్​ జేఏసీ