బీఆర్ఎస్​లో అసమ్మతి లీడర్ల మధ్య టికెట్ల పంచాది?

మహబూబ్​నగర్, వెలుగు: ఎలక్షన్​ ఇయర్​ కావడంతో రూలింగ్​ పార్టీలో కొన్ని నెలలుగా టికెట్ల పంచాది నడుస్తోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, సెకండ్​ కేడర్​ లీడర్లు రానున్న ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను కూడా చాలా చోట్ల లీడర్లు వేర్వేరుగా నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు ప్రొటోకాల్​ ప్రకారం ఆహ్వానాలు పంపకుండా ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే రెండు రోజుల కిందట హైదరాబాద్​లో సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గాల్లో లీడర్ల మధ్య ఉన్న విభేదాలను ప్రస్తావించారు. ‘మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం పార్టీని ఇరకాటంలో పెట్టొద్దు.. 

తీరు మార్చుకోకపోతే తోకలు కట్​ చేస్త’ అని సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్​ లీడర్ల మధ్య ఉన్న విభేదాలు ఎన్నికల నాటికి సద్దుమణుగుతాయా? అని చర్చించుకుంటున్నారు. జడ్చర్ల టికెట్​ కోసం పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి అన్న కొడుకు మన్నె జీవన్​రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ఏడాదిన్నరగా నడుస్తోంది. ఈయన వర్గం నియోజకవర్గంలో గ్రౌండ్​ వర్క్​ స్టార్ట్​ చేసింది. 

ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డిపై అసంతృప్తితో ఉన్న కొందరు సర్పంచులు, మండల లెవల్​ లీడర్లు జీవన్​కు టచ్​లో ఉన్నట్లు సమాచారం. జీవన్​కు అత్యంత సన్నిహితులైన కొందరు లీడర్లు ప్రతి నెలా మహబూబ్​నగర్​లోని ఓ హోటల్​లో నియోజకవర్గంలోని మండలాల పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఎమ్మెల్యే ఈ విషయంపై ఎంపీతో కొన్ని నెలల కింద సీరియస్​ డిస్కషన్​ చేసినట్లు సమాచారం. ఎవరి హద్దులో వారుంటే మంచిదన్నట్లు చెప్పినట్లు తెలిసింది.

బీసీ ఈక్వేషన్​తో..

గద్వాల నియోజకవర్గంలో జడ్పీ చైర్​పర్సన్​ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి మధ్య రెండేండ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రి నిరంజన్​రెడ్డి జడ్పీ చైర్​పర్సన్​కు పరోక్షంగా సపోర్ట్​ చేస్తుండడంతోనే వీరి మధ్య వర్గపోరు దారి తీసిందనే చర్చ నడుస్తోంది. జడ్పీ సమావేశాల్లోనూ వీరి మధ్య విభేదాలు బయట పడగా, ఇటీవల నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి కూడా చైర్​పర్సన్​కు ఆహ్వానం పంపలేదు. ఈ విషయంపై చైర్​పర్సన్​ పార్టీ హైకమాండ్​కు కంప్లైంట్​ చేశారు. 

అయితే, గద్వాలలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం, చైర్​పర్సన్​ కూడా బీసీ వర్గానికి చెందడంతో ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి టికెట్​ ఆశిస్తున్నారు. మంత్రి సపోర్ట్​ కూడా ఉండడంతో టికెట్​పై ఆశలు పెట్టుకున్నారు. కల్వకుర్తిలో సిట్టింగ్​ ఎమ్మెల్యే జైపాల్​యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య టికెట్​ పంచాది నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలను ఇద్దరూ వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి చిత్తరంజన్​ దాస్​ కూడా టికెట్​ కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ఈక్వేషన్​లో తనకు టికెట్​ ఇవ్వాలనే డిమాండ్​ను తెరమీదకు తెస్తున్నారు.

పార్టీ కార్యక్రమాలకు పిలుస్తలేరు..

మక్తల్​లో సిట్టింగ్​ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్​రెడ్డి, బీఆర్ఎస్​ లీడర్​ వర్కాటం జగన్నాథ్​రెడ్డి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. నిరుడు ఎన్నికల్లో వర్కాటం పార్టీ నుంచి టికెట్​ ఆశించినా సిట్టింగ్​లకే టికెట్​ కన్​ఫాం కావడంతో చిట్టెం గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చిట్టెం పార్టీ కార్యక్రమాలకు వర్కాటంను పిలువడం మానేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్​ పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్​ దక్కుతుందనే ఆశతో ఏడాదిన్నరగా వీజేఆర్​ ఫౌండేషన్​ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 

వారసులను బరిలో దింపాలని..

అలంపూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ వీఎం అబ్రహం ఈ ఎన్నికల్లో తన కుమారుడు డాక్టర్​ అజయ్​ను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడి నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం తన కొడుకు మందా శ్రీనాథ్​కు పోటీకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. వీరి మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఫైనల్​గా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎవరికి సపోర్ట్​ చేస్తే, వారికే టికెట్​ కన్​ఫాం అయ్యే చాన్స్​ ఉంది. మరో ఎస్సీ నియోజరవర్గమైన అచ్చంపేటలోనూ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య వర్గపోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. 

ఎంపీ తన కుమారుడు పి.భరత్​ను ప్రోత్సహిస్తుండడంతో తరచూ ఎమ్మెల్యే మధ్య విభేదాలు బయట పడుతున్నాయి. నెల కింద ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఫోన్​లో జరిగిన మాటల యుద్ధం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. నాగర్​కర్నూల్​ నుంచి ఎమ్మెల్సీ కుచకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి మధ్య విభేదాలున్నాయి. కొన్ని నెలలుగా కుచకూళ్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో తన కొడుకు డాక్టర్​ రాజేశ్​కు టికెట్​ ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ టికెట్​ రాకుంటే కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్​ నడుస్తోంది.