కామారెడ్డి జడ్పీ మీటింగ్​లో అధికారులపై బీఆర్ఎస్​ మెంబర్ల ఆగ్రహం

కామారెడ్డి , వెలుగు:  జిల్లా పరిషత్​సర్వసభ్య సమావేశంలో  బీఆర్ఎస్ సభ్యులే.. సమస్యలపై  గళమెత్తారు. గురువారం కామారెడ్డి జడ్పీ చైర్​పర్సన్​దఫేదర్​ శోభ అధ్యక్షతన కలెక్టరేట్​లోని మీటింగ్​హాల్​లో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది.  కలెక్టర్ జితేశ్​వి పాటిల్​, అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్​దొత్రే, సీఈవో సాయాగౌడ్​, డీఎఫ్​వో నిఖిత పాల్గొన్నారు.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మీటింగ్​కు  రాలేదు. 

 జిల్లా ఆస్పత్రి పరిస్థితులపై తల ఎత్తలేకపోతున్నం..

జిల్లా ఆస్పత్రిలో పరిస్థితులపై  ప్రజల్లో తల ఎత్తలేకపోతున్నామని  వైస్ చైర్మన్​ ప్రేమయ్య  ఆవేదన వ్యక్తం చేశారు.  రాత్రి వేళ తీసుకొచ్చే పేషెంట్లను  డాక్టర్లు సరిగా పట్టించుకోవడంలేదని వైస్​చైర్మన్​తో పాటు పలువురు సభ్యులు  పేర్కొన్నారు. ‘ఇటీవల ఒక బాలుడిని కాలిన గాయాలతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అదే సమయంలో తాను కూడా అక్కడే ఉన్నాను.  కానీ డ్యూటీలో ఉన్న డాక్టర్​ అసలు పట్టించకోలేదు.’ అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  హరిసింగ్​అనే డాక్టర్​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.   పుట్టు మూగ  అయిన 25 ఏండ్ల యువకుడు సదరం క్యాంపునకు పోతే 2 ఏండ్ల కాలపరిమితితో సర్టిఫికెట్​ఇచ్చారని సదాశివనగర్​ జడ్పీటీసీ  నర్సింహులు  ప్రస్తావించారు.  అర్హులైన  వారికి  సదరం సర్టిఫికెట్లు ఇస్తలేరని  తాడ్వాయి ఎంపీపీ  రాజు అన్నారు.   కలెక్టర్​ స్పందిస్తూ..  జిల్లా హాస్పిటల్​ను తనిఖీ చేస్తానని, డ్యూటీలో లేని డాక్టర్లపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.   డాక్టర్ల నుంచి  వివరణ తీసుకోవాలని  డీసీహెచ్​వో  విజయలక్ష్మిని  ఆదేశించారు. సదరం సర్టిఫికెట్లను డీఆర్డీవోతో  పరిశీలన చేయిస్తానన్నారు.  

 భగీరథ నీళ్లు వారంలో మూడు  రోజులు కూడా వస్తలే..

మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు మిషన్​ భగీరథ నీళ్లు  వారంలో  మూడు రోజులు కూడా సరిగా వస్తలేవని, వచ్చినట్లు చూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఎంపీపీ నర్సింగ్​రావు ఆఫీసర్లపై గరమయ్యారు.  కొన్ని హాబిటేషన్లలో   భగీరథ పైపులైన్​ పనులు, ట్యాంకుల నిర్మాణం  కూడా  పూర్తి చేయలేదన్నారు. ఎస్​ఈ స్పందిస్తూ   గ్రామాల్లో పరిశీలిస్తామన్నారు. పైపు లైన్​ డ్యామేజ్​అయినప్పుడు తప్పా.. మిగతా అన్ని రోజులు నీటిని సప్లై చేస్తున్నామన్నారు.

సన్న బియ్యం సరిగా లేవు

 హాస్టల్స్​, స్కూల్స్​కు పంపే సన్న బియ్యం సరిగా వస్తలేవని పలువురు సభ్యులు ప్రస్తావించారు.  తాము పరిశీలనకు వెళ్లినప్పుడు అన్నం దొడ్డుగా ఉంటోందని,   ముద్దగా  అవుతోందని దీంతో స్టూడెంట్లు తినలేక పారేస్తున్నారన్నారు.  బ్యాంక్​ అకౌంట్​ నుంచి   రూ. 4 లక్షలు  ట్రాన్స్​ఫర్​చేసినందుకు తన  తెల్ల రేషన్​ కార్డు  రద్దు చేశారని, జడ్పీటీసీ పరిస్థితే గిట్ల  ఉంటదా?  అని పిట్లం జడ్పీటీసీ  శ్రీనివాస్​రెడ్డి వాపోయారు. చనిపోయిన వ్యక్తుల పేరుతో డీలర్లు  బియ్యం నొక్కేస్తున్నారని   సదాశివనగర్​ జడ్పీటీసీ నర్సింహులు ప్రస్తావించారు. 

పంచాయతీ సెక్రటరీలను పర్మినెంట్​ చేయాలని తీర్మానం
 జూనియర్​ పంచాయతీ సెక్రటరీలను పర్మినెంట్​ చేయాలని  జడ్పీలో తీర్మానించారు.  మూడేండ్ల కాల పరిమితి ముగిసిందని,  వీరు పల్లెల్లో  విధులు సక్రమంగా నిర్వహించడం వల్లనే  అవార్డులు వస్తున్నాయని, వెంటనే పర్మినెంట్​ చేయాలని తీర్మానం చేసిన కాపీని ప్రభుత్వానికి పంపారు. 3 గంటల పాటు 8  అంశాలపై చర్చించి మీటింగ్​ ముగిసిందని ప్రకటించారు. ఇంకా  పలు శాఖలపై చర్చించలేదు. 

సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే ఎట్లా?

 పంచాయతీల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల గురించి  డీపీవో శ్రీనివాస్​రావు  వివరించగానే ..  జడ్పీ వైస్​చైర్మన్​ ప్రేమయ్య  మాట్లాడుతూ..  ‘కింది స్థాయి సిబ్బంది శానిటేషన్ లేబర్స్​, సెక్రెటరీలు , ఇతర సిబ్బంది పనిచేస్తేనే  అవార్డులు వస్తున్నయ్..  ప్రజాప్రతినిధులుగా మనం వెళ్లి ఫొటోలు దిగి వస్తున్నాం. కానీ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు.  వాళ్లకు ఇచ్చే తక్కువ జీతాలు కూడా సరిగా ఇవ్వక పోతే ఎట్లా..? ’ అంటూ ఆఫీసర్లను నిలదీశారు. బీబీపేట గ్రామ పంచాయతీలో  శానిటేషన్​ వర్కర్​ఉరేసుకుని చనిపోతే ఆఫీసర్లు ఎందుకు  రాలేదని  ప్రశ్నించారు. ప్రతి నెలా జనరల్​ ఫండ్​ నుంచి జీతాలు అందేలా చూడాలని కోరారు.  తగిన చర్యలు తీసుకుంటామని డీపీవో చెప్పారు.