బీఆర్ఎస్ మైండ్ గేమ్.. పొంగులేటి లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్

  • కేటీఆర్ సమక్షంలో కారెక్కిన పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకటరావు
  • త్వరలో మరికొందరు చేరుతారని ప్రచారం
  • కోరం కనకయ్య, ఊకంటి గోపాలరావు టచ్​లో ఉన్నారంటూ లీకులు
  • హస్తం పార్టీ జోరుకు బ్రేక్​వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్​పార్టీని వీక్ చేసేందుకు బీఆర్ఎస్​మైండ్​స్టార్ట్​చేసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేరికతో ఫుల్లు జోష్​లో ఉన్న హస్తం పార్టీని దెబ్బ తీసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రత్యర్థి పార్టీ నాయకులను, క్యాడర్​ను డైలమాలో పడేసేందుకు ఎత్తులు వేస్తోంది. గురువారం భద్రాచలానికి చెందిన పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకటరావు.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరగా, ఇంకొందరు క్యూలో ఉన్నారంటూ అధికార పార్టీ లీకులిస్తోంది.

ఇద్దరు ముఖ్య నేతలతోపాటు మరికొందరు చోటా లీడర్లు పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. జిల్లాలో ఫుల్లు దూకుడుతో ఉన్న కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో నెట్టడంతోపాటు, అనుచరులను హస్తం పార్టీ లీడర్లు అనుమానించేలా చేయడమే లక్ష్యంగా తెలుస్తోంది. కాంగ్రెస్​లో చేరడానికి ముందే పొంగులేటిని ఒంటరిని చేసేందుకు, ఆయన వెంట ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితులను అడ్డుపెట్టుకుని మైండ్​గేమ్​కు తెరలేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెంకు చెందిన మరో నేత ఊకంటి గోపాలరావు తమతో టచ్​లో ఉన్నారని, త్వరలోనే వాళ్లు కూడా పార్టీ మారతారంటూ బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కుదరలే

ఈ ఏడాది జనవరి1న సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బీఆర్ఎస్​నుంచి బయటకు వెళ్తారని కన్ఫామ్ అయింది. పార్టీ హైకమాండ్ అప్పట్లోనే పొంగులేటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగ్గా, దానికి వారం ముందు నుంచే మంత్రి హరీశ్​రావు ఖమ్మంలో మకాం వేశారు. పొంగులేటిని పార్టీకి దూరం కాకుండా ఉండేందుకు రాయబారాలు నడిపించారు. ఎంతకీ వర్కవుట్ కాకపోవడంతో ఆయన వెంట ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చారు. ఒకవైపు పాత కేసులను బయటకు తీయడం, మరోవైపు సంప్రదింపులు చేయడం, సీఎం కేసీఆర్​ను కలిపిస్తామంటూ ఆఫర్లు ఇచ్చారు.

కోరం కనకయ్యతో అప్పట్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ద్వారా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత రకరకాల ఈక్వేషన్లతో పొంగులేటి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్​లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోని పరిస్థితుల కారణంగా ఒకరిద్దరికి టికెట్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మళ్లీ అవే స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఇదే అదనుగా భద్రాచలం టికెట్ రేసులో ఉన్న తెల్లం వెంకటరావును పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్​కు, పొంగులేటికి బీఆర్ఎస్​ షాక్ ఇచ్చింది. ఒకవేళ కమ్యూనిస్టులతో అధికార పార్టీకి పొత్తులు ఓకే అయితే భద్రాచలం సీటు సీపీఎంకు కేటాయించే అవకాశముందన్న ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడర్ల జోరుకు బ్రేకులు వేసేందుకు బీఆర్ఎస్ ఈ ఎత్తు వేసినట్టు సమాచారం.

తప్పుడు ప్రచారమంటున్న కాంగ్రెస్

తెల్లం వెంకటరావు వైసీపీలో ఉన్నప్పటి నుంచి పొంగులేటి వెంటే ఉన్నాడు. 2014 ఎన్నికల్లో మహబూబాబాద్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పొంగులేటితోపాటు బీఆర్ఎస్ లో చేరి 2018లో భద్రాచలం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, భద్రాచలం నియోజకవర్గ ఇన్​చార్జిగా ఉన్న ఆయన గత నెలలో పొంగులేటితో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వెంకటరావు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం వెనుక మంత్రి హరీశ్​రావు స్కెచ్ ఉందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, కోరం కనకయ్య, ఊకంటి గోపాలరావును పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నేతలు కావాలనే తమ లీడర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు.