కొండనిండా ‘బీఆర్ఎస్’ భక్తులే !

  • యాదగిరిగుట్టకు మంత్రి, ఎమ్మెల్యేల వెంట తరలివచ్చిన 1500 మంది లీడర్లు, కార్యకర్తలు   
  • ఇబ్బందులు పడ్డ సాధారణ భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన దివ్యవిమాన గోపురానికి ఏర్పాటు చేసే బంగారు తాపడానికి విరాళం ఇవ్వడం కోసం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆదివారం యాదగిరిగుట్ట టెంపుల్ కు వచ్చారు. ఆయనతో పాటు మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వచ్చారు. వీరి వెంట కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు1500 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడ్డారు.

వీరితో పాటు రూ.150 చెల్లించి వీఐపీ దర్శన టికెట్లు కొన్న భక్తులు కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. మంత్రి, ఎమ్మెల్యేలతో వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు బ్రేక్ దర్శన టికెట్లు కొని తూర్పు రాజగోపురం(ఎంట్రీ) నుంచి కాకుండా పశ్చిమ రాజగోపురం(ఎగ్జిట్) నుంచి ఆలయంలోకి వెళ్లడంతో.. స్వామివారిని దర్శించుకుని పశ్చిమ రాజగోపురం నుంచి బయటకు వచ్చే భక్తులు అవస్థలు పడ్డారు. మరోవైపు బ్రేక్ దర్శన టికెట్లు కొన్న బీఆర్ఎస్ లీడర్లను  నిబంధనలతో సంబంధం లేకుండా ఎగ్జిట్(పశ్చిమ రాజగోపురం) నుంచి ఆలయంలోకి వెళ్లేలా ఆలయ ఆఫీసర్లు వెసులుబాటు కల్పించారు. అక్కడి నుంచి ప్రధానాలయంలోకి చేరుకున్న బీఆర్ఎస్ లీడర్లను నేరుగా వీఐపీ దర్శన, ధర్మదర్శన క్యూలైన్లలోకి పంపించి స్వామివారిని దర్శించుకునేలా అనుమతించారు. దీంతో రూ.150 వీఐపీ టికెట్లు కొన్న భక్తులు గంటల తరబడి లైన్లలోనే వెయిట్ చేయాల్సి వచ్చింది.  

టెంపుల్​లో సెల్ఫీలు.. స్పందించని అధికారులు

మంత్రి, ఎమ్మెల్యేల వెంట వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు ప్రధానాలయ ముఖ మంటపంలో హల్ చల్ చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రధానాలయ ముఖ మంటపంలో హడావుడి చేశారు. క్యూలైన్ల నుంచి బయటకు వెళ్లకుండా.. క్యూలైన్ల గ్రిల్స్ పైకెక్కి దూకి ప్రధానాలయ ముఖ మంటపంలోకి ప్రవేశించారు. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్లతో ఫొటోలు, సెల్పీలు దిగుతూ భక్తులకు ఇబ్బంది కలిగించారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోలేదు. ఎస్పీఎఫ్  పోలీసులు, హోంగార్డుల ముందే ఇంత తతంగం నడిచినా సైలెన్స్​గా ఉన్నారు.

మరోవైపు బీఆర్ఎస్ నాయకుల మెడలో దేవస్థాన శల్లాలు(కండువాలు) దర్శనమిచ్చాయి. వీటిని సువర్ణ పుష్పార్చన, స్వామివారి నిత్యకల్యాణం, వేదాశీర్వచనం చేయించిన  భక్తులకు మాత్రమే ఇస్తారు. కానీ, ఇవేమీ చేయించని బీఆర్ఎస్ లీడర్ల మెడల్లో దేవస్థాన కండువాలు కనిపించడం చర్చనీయాంశమైంది. ఆఫీసర్లను అడిగితే ఇవి తమ దేవస్థానానికి సంబంధించిన శల్లాలు కావని స్పష్టం చేశారు. వీటిని భువనగిరిలోని ఓ షాప్ నుంచి స్థానికంగా ఉండే ఓ బీఆర్ఎస్ లీడర్ ​తెచ్చినట్లు తెలిసింది.  

స్వర్ణ తాపడానికి రూ.55.03 లక్షల విరాళం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన దివ్యవిమాన గోపురానికి ఏర్పాటు చేసే బంగారు తాపడం కోసం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆదివారం కిలో బంగారానికి అవసరమయ్యే రూ.55,03,980 నగదు అందజేశారు. మంత్రి మల్లారెడ్డి, మరో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి నగదును డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులుకు ఇచ్చారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తన నియోజకవర్గం తరఫున ఈ నగదు అందజేశానన్నారు.  

వీఐపీలనే పట్టించుకుంటున్నరు.. 

కొత్తగా నిర్మించిన ఆలయంలో ఆలయ ఆఫీసర్లు..వీఐపీలకు, రాజకీయ నాయకులకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నరు. యాదగిరిగుట్ట ఆలయం రాజకీయ నాయకులకు అడ్డాగా మారింది. సాధారణ భక్తులను పట్టించుకునే నాథుడే లేడు. వీఐపీలు వచ్చారని గంటల తరబడి క్యూలైన్లను ఆపారు. ప్రశాంతంగా దేవుడిని దర్శనం కూడా చేసుకోనివ్వరా? ‌‌‌‌ ‌‌‌‌
 ‌‌‌‌ ‒ మహేందర్, భక్తుడు, హైదరాబాద్