
- పోటీ చేస్తే ఓడుతామనే వెనుకంజ..
- ఓటింగ్‌లో పాల్గొనడమూ అనుమానమే
- ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరమవుతున్న గులాబీ పార్టీ
- బీజేపీ తరఫున గౌతంరావు, మజ్లిస్ తరపున మీర్జా రియాజ్ నామినేషన్లు
- మరో ఇద్దరు ఇండిపెండెంట్లు దాఖలు.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
- ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు.. మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు
- ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరుసగా మరో ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరమైంది. కొద్ది రోజుల కింద జరిగిన ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని గులాబీ పార్టీ.. తాజాగా హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నది. పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందనే చర్చ నడుస్తున్నది.
మరోవైపు అధికారపార్టీ కాంగ్రెస్.. మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్నది. నామినేషన్లకు శుక్రవారం గడువు ముగియడం, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు మజ్లిస్ వర్సెస్ బీజేపీగా సాగనుంది. మజ్లిస్ తరఫున ఇటీవలే ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ తరఫున గౌతంరావు నామినేషన్ వేశారు.
మరో ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేసినా పోటీ మాత్రం బీజేపీ, మజ్లిస్ మధ్యే ఉండబోతున్నది. మజ్లిస్ కు మెజార్టీ సీట్లు ఉండడం, కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వబోతుండడంతో ఆ పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు ఇవ్వడంతో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీని ఎంఐఎంకే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతు పక్కా అనేది తేలిపోయింది. ఒకటి, రెండు రోజుల్లో పీసీసీ దీనిపై ఓ ప్రకటన చేయనున్నట్టు తెలిసింది.
ఓటింగ్‌కూ బీఆర్ఎస్ దూరమేనా?
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 112 ఓట్లు (ఎక్స్ఆఫీషియో ఓట్లతో కలిపి) ఉండగా.. ఎంఐఎంకు 49 మంది, కాంగ్రెస్ కు 14 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉంది. దీంతో పోటీ చేసినా ఎలాగూ గెలవబోమని భావించిన బీఆర్ఎస్పెద్దలు.. పోటీకి దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
ఈక్రమంలో బీఆర్ఎస్సభ్యులు కనీసం ఓట్లయినా వేస్తారా?.. వేస్తే ఎవరికి వేస్తారనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగానే ఉంది. దీంతో ఎంఐఎం అభ్యర్థికి బీఆర్ఎస్ సభ్యులుఓట్లేస్తే కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్.. ఈ మూడు పార్టీలూ ఒకటేనని బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అలాకాకుండా బీజేపీకి వేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క తాను ముక్కలేనని అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు మధ్యేమార్గంగా ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండబోదని గులాబీ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది.
మళ్లీ చాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు: రియాజ్
మరోసారి తనకు అవకాశం ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ఎఫెండీ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, బీజేపీ నామమాత్రంగా పోటీ లో ఉంటుందన్నారు. తమ బలం తమకు ఉన్నదని, ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎందే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలకతీతంగా ఓటేయండి: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి
పార్టీలకతీతంగా అందరు సభ్యులు ఓటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యీ అభ్యర్థి ఎన్. గౌతమ్ రావు అన్నారు. నామినేషన్ అనంతరం జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఆయన మాట్లాడుతూ.. జరగబోయే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ తరుఫుననామినేషన్ దాఖలు చేశానన్నారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీ పోటీలో ఉంటుందని, ఎంఐఎం దురాగతాలకు వ్యతిరేకంగా బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికలకూ..
బీఆర్ఎస్ పార్టీ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉంది. నిజామాబాద్- కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 7న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేయాలని పలువురు నేతలు ఆశపడినా.. పార్టీ అధిష్టానం మాత్రం వారి ఆశలపై నీళ్లుజల్లింది.
ఆ స్థానాల్లో బీజేపీ బలంగా ఉండడం.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం లేకపోవడంతోనే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న ఆ పార్టీ పెద్దలు, ఇలా వరుసగా అన్ని ఎన్నికలకు దూరంగా ఉండడంపై ఆ పార్టీ కేడర్‌లో చర్చ నడుస్తున్నది.
మజ్లిస్ గెలుపు లాంఛనమే..
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 57. మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వనుండడంతో 63 ఓట్లు ఖాయం. ఈ లెక్కన మజ్లిస్ గెలుపు లాంఛనమే కానున్నది. ఈ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా చివరి క్షణంలో బీజేపీ తన అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో పోలింగ్ అనివార్యమైంది. ఈ నెల 23 న పోలింగ్, ఈ నెల 25 న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒకవేళ బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చినా ఈ రెండు పార్టీల సభ్యుల సంఖ్య కేవలం 49 కే పరిమితం కానున్నది.