- ఆయనో దిగజారిన ముఖ్యమంత్రి : హరీశ్‌రావు
- డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అని మాటతప్పిండు
- లోక్‌సభ ఎన్నికల్లో పంద్రాగస్టుకని నాటకమాడిండు
- దేవుళ్ల మీద ఒట్లు పెట్టి.. మోసం చేసిండు
- రుణమాఫీ పచ్చి అబద్ధమని కామెంట్
హైదరాబాద్, వెలుగు : రేవంత్‌రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘ఈ విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గానీ, తెలంగాణ చరిత్రలో గానీ ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు” అని గురువారం ఒక ప్రకటనలో ఆయన దుయ్యబట్టారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి కూడా చెప్పినట్లు రుణమాఫీ హామీని రేవంత్ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.
‘‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ. 40 వేల కోట్ల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15 వరకు రూ. 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టిండు. అంటే రూ. 9 వేల కోట్లు కోత పెట్టిండు” అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘‘తన మాటను ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా.. అబద్ధమే తన లక్షణం..
మోసమే తన విధానం.. మాట తప్పడమే తన నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నడు” అని దుయ్యబట్టారు. తాము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు రూ. 17వేల కోట్లు అయిందని ఆయన తెలిపారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా? 17,869 కోట్లు మాత్రమే అవుతాయా?” అని ప్రశ్నించారు. రుణమాఫీ పచ్చి అబద్ధమని చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
దైవ ద్రోహం చేసిండు
‘‘నోటికి వచ్చినట్లు బీఆర్ఎస్ను తిడితే అబద్ధాలు నిజాలైపోవు. రేవంత్ రెడ్డీ..! నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు.. దైవ ద్రోహానికి పాల్పడ్డవ్” అని హరీశ్‌రావు విమర్శించారు. ‘సీఎంగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ, నీకు ఆ సంస్కారం లేదు. సీఎం స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో
నువ్వు చేసిన పాపఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్న. రేవంత్ చేసిన దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించొద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిండో, ఆ దేవుళ్లందరి దగ్గరికి పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్త” అని ఆయన తెలిపారు.