తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నరు : కోనేరు కోనప్ప

  • బీజేపీ, బీఎస్పీతో అప్రమత్తంగా ఉండాలి 
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప 

కాగజ్ నగర్, వెలుగు: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సిర్పూర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాగజ్ నగర్ మండలం చారిగాం, బోడపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల దయతో మూడు సార్లు గెలిచానని, ఈ కాలంలో వారికి చేయగలిగినంత అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. 

నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రతో రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు చింతలమానేపల్లి మండలం గూడెం ప్రాణహిత నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి మారుమూల గ్రామంగా ఉన్న గూడెం, పరిసర గ్రామాలను అభివృద్ధి  చేశానన్నారు. అత్యంత మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయించానని, వానాకాలం వస్తే రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉన్న సిర్పూర్–కౌటాల మార్గంలో తాడిచెట్టు ఒర్రెపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి సమస్య పరిష్కరించానని గుర్తు చేశారు. 

కౌటాల మండలం గుండాయి పేట్ వద్ద వార్ధా నదిపై హై లెవెల్ బ్రిడ్జి మంజూరైందని, త్వరలోనే పనులు మొదలు కానున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని మహిళలకు రక్త హీనతను దూరం చేసి ప్రసవ సమయంలో ఇబ్బంది కాకుండా పోషకాహార కిట్ సొంతంగా తయారు చేసి అందించామని, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వేలాది మందికి ఆకలి బాధ తీర్చామన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మళ్లీ గెలిపించాలని కోనప్ప కోరారు.