
- ములుగు నుంచి బీఆర్ఎస్అభ్యర్థిగా బడే నాగజ్యోతి
- ప్రస్తుతం ములుగు ఇన్చార్జి జడ్పీ చైర్‌పర్సన్‌గా విధులు
- ఈమెదీ కోయ సామాజికవర్గం.. మావోయిస్టు నేపథ్యమే..
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : రాబోయే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ హైకమాండ్బడే నాగజ్యోతిని బరిలోకి దింపబోతోంది. ములుగు అభ్యర్థిగా ప్రకటించిన జ్యోతి ప్రస్తుతం ములుగు జడ్పీ ఇన్చార్జి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. సీతక్క మాదిరే జ్యోతిది కూడా కోయ సామాజిక వర్గమే కాగా, ఇద్దరికీ మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉండడం విశేషం.
సీఎం కేసీఆర్ సోమవారం115 సీట్లతో బీఆర్ ఎస్ లిస్ట్ రిలీజ్ చేయగా అందులో నాగజ్యోతే అతి చిన్న వయస్కురాలు. ఎమ్మెల్యే అభ్యర్థి కనీస వయస్సు 25 సంవత్సరాలుకాగా, ఈమె వయస్సు 29 ఏళ్లే కావడం గమనార్హం. గత జడ్పీటీసీ ఎన్నికల్లో తాడ్వాయి నుంచి గెలిచిన జ్యోతి ములుగు జడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మరణించడంతో జ్యోతి ఇన్ చార్జ్ జడ్పీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.
సీతక్కకు గట్టి పోటీ..
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జ్యోతి గట్టి పోటీ ఇస్తారని బీఆర్ఎస్లీడర్లు అభిప్రాయపడుతున్నారు. సీతక్క నేరుగా మావోయిస్టు పార్టీలో పనిచేసి పోలీసులకు లొంగిపోయి ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చారు. జ్యోతి మాత్రం మావోయిస్టు బడే నాగేశ్వర్ రావు అలియాస్ ప్రభాకర్, రాజేశ్వరి అలియాస్ నిర్మలక్కల ఏకైక సంతానం. తండ్రి నాగేశ్వరరావు ఏటూరునాగారం దళ కమాండర్‌గా పనిచేస్తూ 1999లో జరిగిన ఎన్ కౌంటర్‌లో చనిపోయారు.
అప్పటికి దళ సభ్యురాలిగా ఉన్న రాజేశ్వరి పోలీసులకు లొంగిపోయారు. ఐదేళ్ల కింద అనారోగ్యంతో ఆమె కూడా మరణించారు. ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన నాగజ్యోతికి ఎట్టి జగదీశ్‌తో పెళ్లి కాగా, వీరికి ఓ కొడుకు ఉన్నాడు. కాగా తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన బీఆర్ఎస్రుణం తీర్చుకుంటానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని బడే నాగజ్యోతి ‘వెలుగు’కు చెప్పారు.