పార్లమెంట్​ను సీఎం తప్పుదోవ పట్టించిండు :హరీశ్​ రావు

పార్లమెంట్​ను సీఎం తప్పుదోవ పట్టించిండు :హరీశ్​ రావు
  • మూసీ పరిహారంపై కేంద్రానికి చెప్పినవి అబద్ధాలు: హరీశ్​ రావు

హైదరాబాద్​, వెలుగు: మూసీ బాధితులకు పునరావాసం, పరిహారంపై కేంద్రాన్ని, పార్లమెంట్​తో పాటు ప్రజలనూ కాంగ్రెస్​ సర్కారు తప్పుదోవ పట్టించిందని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కేంద్రానికి చెబుతున్నదొకటైతే ఇక్కడ అమలు చేస్తున్నది మాత్రం వేరేలా ఉందని అన్నారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో భూసేకరణ చట్టం 2013ను అమలు చేస్తున్నామంటూ పచ్చి అబద్ధం చెప్పారన్నారు. పార్లమెంట్​లో బీఆర్ఎస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు భూసేకరణ చట్టం 2013ను రాష్ట్రం అమలు చేస్తున్నదని కేంద్రం సమాధానం చెప్పిందన్నారు.

కానీ, అది జరగడం లేదన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. చట్టం ప్రకారం ముందుగా బాధితులను గుర్తించాల్సి ఉంటుందని, కానీ, ఎక్కడా అలా చేయలేదని విమర్శించారు. మూసీ విషయంలో నోటీసులు, డీపీఆర్​లు, ఎన్యూమరేషన్ వంటివేవీ లేవని పేర్కొన్నారు. అవేవీ లేకుండానే మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లను ఖాళీ చేయించారన్నారు. ఈ విషయంలో పార్లమెంటుకు చెప్పిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని.. ఎక్కడికి రావాలో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.