అప్పులపై సీఎం తప్పుడు ప్రచారం

అప్పులపై సీఎం తప్పుడు ప్రచారం
  • బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు రూ. 4.26 లక్షల కోట్లే: హరీశ్ రావు  

మెదక్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని, 16వ ఆర్థిక సంఘం ముందు కూడా  రేవంత్ సర్కారు అబద్ధాలు చెప్పిందన్నారు. మంగళవారం మెదక్ లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని మరిచి సీఎం రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6.85 లక్షల కోట్ల అప్పు ఉందంటూ ఇంకెన్ని రోజులు తప్పుడు ప్రచారం చేస్తారని అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లోనే తాను అప్పులపై వాస్తవాలు వివరించానని, అయినా ప్రజా పాలన దినోత్సవ వేదికగా మళ్లీ అదే తొండి వాదన వినిపించారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమం కోసం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమే అని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రం గత 9 ఏండ్లలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు.

దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీసిందని ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగదన్నారు. సీఎం అనాలోచిత చర్యల వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ 10లో కూడా చోటు దక్కలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడమంటే ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం కాదని, ముఖ్యమంత్రిగా  రాష్ట్ర ప్రతిష్టను, గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.