ఫార్ములా ఈ - కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదవడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసి ఏ1 గా చేర్చడంపై హరీష్ రావు స్పందించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఫార్ములా ఈ - కారు రేసింగ్ కేసుపై మాట్లాడారు. కేటీఆర్ పై కేసు పెట్టడాన్ని ఖండించారు. ప్రశ్నిస్తే దబాయిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెడుతున్నారని హరీష్ ఆరోపించారు.రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. కేటీఆర్ పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని స్పీకర్ కు లేఖ రాశారు.
ఫార్ములా ఈ కార్ రేసు పై అసెంబ్లీ చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు:
ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును చేర్చింది. ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును ఏసీబీ చేర్చింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 120B సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. 3 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం. ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్’ యాక్ట్ కింద ఈ కేసులను ఏసీబీ నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.