బీఏసీ మీటింగ్ కు మీరెలా వస్తారు : హరీశ్ పై మంత్రి శ్రీధర్ బాబు

బీఏసీ మీటింగ్ కు మీరెలా వస్తారు : హరీశ్ పై మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన  బీఏసీ సమావేశం ప్రారంభమైంది.  దీనికి బీఆర్ఎస్ తరుపున కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. తనకు బదులుగాహరీశ్‌రావు బీఏసీకి వస్తారని ముందే సమాచారమిచ్చారు కేసీఆర్.  హరీష్ రావు సమావేశానికి రాగా మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ కు బీఆర్ఎస్ ఇచ్చిన జాబితాలో కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఉన్నాయని..  జాబితాలో పేరు లేకుండా  మీరెలా వస్తారని హరీష్ రావుని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.  దీంతో  బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చారు హరీశ్‌రావు.  

జాబితాలో పేరు లేకున్నా, సభ్యుడు అనారోగ్యంతో బీఏసీ మీటింగ్ కు రాకపోయినా వేరే ఎమ్మెల్యేలను గతంలో బీఏసీ మీటింగ్ లోకి అనుమతి ఇచ్చామన్నారు హరీష్ రావు.  అవసరమైతే గత రికార్డులను పరిశీలించాలని...తాను చెప్పింది అబద్దం అయితే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని  సవాల్ విసిరారు హరీష్ .  స్పీకర్ కు కేసీఆర్ నిన్ననే ఫోన్ చేసి  బీఏసీ మీటింగ్ కు తనకు  బదులుగా హరీష్ రావు వస్తారని చెప్పారన్నారు.  శ్రీధర్ బాబు అభ్యంతరంతో సర్దుకుపోవాలని స్పీకర్ చెప్పారన్నారు హరీష్.  

ఆశగా ఎదురు చూసిన ఆసరా పింఛన్‌దారులకు గవర్నర్‌ ప్రసంగం నిరాశ మిగిల్చిందన్నారు  హరీశ్‌రావు.  అసెంబ్లీ మీడియా పాయింట్‌లో  ఆయన మాట్లాడారు.  మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని ఇప్పుడు మహిళలు వాటి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.