రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి : హరీశ్ రావు

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి : హరీశ్ రావు
  •     రుణమాఫీపై ఆయనది తప్పుడు ప్రచారం: హరీశ్ రావు
  •     రుణమాఫీ పూర్తయినట్టు నిరూపిస్తే రిజైన్ చేస్తానని సవాల్  

హైదరాబాద్, వెలుగు : రైతులకు రుణమాఫీ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకుండానే.. అందరికీ రుణమాఫీ చేసినట్టుగా సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో హరీశ్‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పూర్తి చేయనందుకు రైతులకు రేవంత్‌‌‌‌ క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలన్నారు. రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి..

రూ.17 వేల కోట్ల రుణాలే మాఫీ చేశారని ఆరోపించారు. 47 లక్షల మందిలో 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. రైతులందరికీ రుణమాఫీ జరిగినట్టు రేవంత్‌‌‌‌రెడ్డి నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్‌‌‌‌ సవాల్ చేశారు. కొడంగల్, సిద్ధిపేట సహా రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వచ్చేందుకు  సిద్ధంగా ఉన్నానన్నారు. రైతు బంధు డబ్బులు ఇంకా ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై తాము ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు 1.16 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. రుణమాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద రేవంత్ ఒట్లు వేసి మాట తప్పారని.. ఇప్పుడు దేవుళ్లు రాష్ట్రాన్ని శిక్షిస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. రేవంత్ పాపం ప్రజలకు తగలొద్దని దేవుళ్లను వేడుకోవడానికి త్వరలోనే తీర్థయాత్రలకు వెళ్తానన్నారు.  సీఎం రేవంత్ భాష జుగుప్సాకరంగా ఉందని హరీశ్ అన్నారు. సిగ్గు, జాతి అని ఓ సీఎం మాట్లాడొచ్చునా? అని ప్రశ్నించారు. రైతుల గురించి ప్రశ్నిస్తే రేవంత్ తన చావును కోరుకుంటున్నారని, దాడులు చేయిస్తున్నారని అన్నారు. సీఎం ప్రోద్బలంతోనే సిద్ధిపేటలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.