
- అసెంబ్లీలో రేవంత్ భాష.. బూతు సినిమా స్క్రిప్ట్లా ఉంది
- కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు
- 70 శాతం నీటి వాటాలకు మార్గం సుగమం చేశారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాతిపితగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే.. బూతు పితగా సీఎం రేవంత్ రెడ్డి పేరు సంపాదించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో రేవంత్ వాడిన భాష.. బూతు సినిమా కోసం రాసుకున్న స్క్రిప్ట్‌లాగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలపైనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన చరిత్ర రేవంత్‌దని పేర్కొన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్లను రాబట్టేందుకు కాలికి బలపం కట్టుకుని ప్రధాని, సుప్రీంకోర్టును ఒప్పించి సెక్షన్ -3ని సాధించారని అన్నారు. 70 శాతం నీటి వాటాలకు మార్గం సుగమం చేసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు.
నీటి పంపకాల కోసం ఢిల్లీకి వెళ్లాం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీళ్లను రెండు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న దానిపై తాము ఢిల్లీకి వెళ్లామని, తెలంగాణ నుంచి ఎస్కే జోషి, ఏపీ నుంచి ఆదిత్యనాథ్ దాస్ మీటింగ్‌కు హాజరయ్యారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆదిత్య నాథ్ దాస్ ఈ రోజు రేవంత్ రెడ్డి సలహాదారుడని, తెలంగాణకు నీటి పంపకాల విషయంలో అన్యాయం జరగడానికి కారణమైన ఆదిత్య నాథ్ దాస్ ను అడ్వైజర్ గా పెట్టుకున్నారని
విమర్శించారు.
కాంగ్రెస్, టీడీపీ పాలకులు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల కృష్ణాలో రాష్ట్రానికి తగిన వాటర్ రాలేదని, ఈ ద్రోహానికి, అన్యాయానికి కారణం మీరే కాదా? అని నిలదీశారు. ఏపీలో 512 టీఎంసీల వినియోగం ఉండే ప్రాజెక్టులు కడితే.. తెలంగాణలో 299 టీఎంసీల వినియోగం కలిగిన ప్రాజెక్టులు మాత్రమే నిర్మించారని పేర్కొన్నారు. పాలమూరు కరువును తీర్చింది కేసీఆర్అని చెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించి.. పంప్‌హౌస్‌ల వద్ద నిద్రపోయి 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు.
హైదరాబాద్‌లో తిట్ల పోటీలు పెట్టాలి
‘రాజకీయాలను కలుషితం చేసింది.. బూతులకు నిలయం చేసింది రేవంతే’ అని హరీశ్‌రావు విమర్శించారు. ‘‘అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే రేవంత్ మాట్లాడిన అబద్ధాలకే ప్రభుత్వ ఖజానా మొత్తం పోతుంది. హైదరాబాద్నగరంలో అందాల పోటీలే కాదు.. తిట్ల పోటీలూ పెడితే బాగుంటుంది” అని అన్నారు.