
SLBC టన్నెల్ ప్రమాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది...SLBC టన్నెల్ ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. SLBC ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. ఏజెన్సీలను సమానవ్యయం చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఘటన జరిగి ఇన్ని రోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదని.. మంత్రులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. హెలికాప్టర్ నుండి సొరంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా అని ప్రశ్నించారు. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని.. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైందని అన్నారు హరీష్ రావు.
ముఖ్యమంత్రికిఎన్నికలు ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా అని ప్రశ్నించారు హరీష్ రావు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపొతున్నారని.. ప్రభుత్వ ఫెయిల్యూర్ కప్పి పుచ్చుకోవడానికి తమపై నెపం నెడుతున్నారని అన్నారు. SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని.. SLBC కోసం కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ హయంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని అన్నారు. SLBC కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి 100 కోట్ల మోబిలైజేశన్ ఫండ్ ఇచ్చామని అన్నారు.
రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదని.. ఈ ఘటనతో రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని అన్నారు హరీష్ రావు.