
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ విమర్శ
- మల్లన్న సాగర్లో నీళ్లున్నా సప్లై చేయట్లేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. వరంగల్ జిల్లాలో దేవాదుల కింద లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని.. మల్లన్న సాగర్, దుబ్బాకలోనూ పంటలు ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్లో నీళ్లున్నా పంటలకు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతే అది ప్రభుత్వ బాధ్యతే అని ఇరిగేషన్ మంత్రి అంగీకరించారని చెప్పారు.
మరోవైపు ఏపీ జలదోపిడీతో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోనూ పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. అలాగే, కొనుగోలు కేంద్రాలు టైంకు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే పంటలు అమ్ముకుని నష్టపోయారన్నారు. తమ హయాంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్నే కొనుగోలు చేసిందన్నారు. ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు.
సభ్యులకు తెలియకుండా ప్రశ్నలను మారుస్తున్నారుని ఆరోపించారు. జీరో అవర్ ఉన్నా లేకున్నా క్వశ్చన్ అవర్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని, సభ్యుల హక్కులను స్పీకర్ కాపాడాలని కోరారు. ప్రభుత్వం సర్కారు భూములను తాకట్టుపెట్టి రూ.వేల కోట్ల అప్పులు తెస్తున్నదని మండిపడ్డారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, జీహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టుపెట్టి రూ.50 వేల కోట్లు అప్పు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.