సమగ్ర సర్వేకు టీచర్లు వద్దు : ఎమ్మెల్యే హరీశ్ రావు

సమగ్ర సర్వేకు టీచర్లు వద్దు : ఎమ్మెల్యే హరీశ్ రావు
  • సీఎం రేవంత్‌ రెడ్డికి​  హరీశ్ లేఖ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే డ్యూటీల నుంచి గవర్నమెంట్ టీచర్లను మినహాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సర్వేకు టీచర్ల సేవలను వాడుకోవడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్​హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతున్నదని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో స్టూడెంట్లు, తల్లిదండ్రులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు.  ‘‘విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ల సేవలను కేవలం జనాభా లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయక చర్యలు, ఎలక్షన్ల విధులకే వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ రూల్స్​కు విరుద్ధంగా టీచర్లను కులగణన కోసం వాడుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే” అని అన్నారు. 

రాహుల్.. అశోక్ నగర్ వెళ్లండి 

హైదరాబాద్ లోని అశోక్​నగర్​వెళ్లి నిరుద్యోగ యువతను కలవాలని రాహుల్ గాంధీని హరీశ్ కోరారు. ‘‘ఎన్నికలకు ముందు మీరు అశోక్​నగర్​లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే.. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ దారుణాలు మీకు తెలుసా? మీరు ఒక్కసారి అక్కడికి వెళ్లి, నిరుద్యోగుల ఆవేదన వినండి. అశోక్​నగర్​ను శోకనగర్​గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి” అని ట్వీట్ చేశారు.  2 లక్షల ఉద్యోగాలు, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రూ.5 లక్షల యువ వికాసం పథకం వంటి హామీల సంగతేమైంది? అని ప్రశ్నించారు.