- బీఆర్ఎస్ ఎమ్మెల్యేహరీశ్ రావు డిమాండ్
- ప్రభుత్వ నిర్లక్ష్యం 8 వేల మంది ఉద్యోగులకు శాపంగా మారిందని విమర్శ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం 8 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు నష్టం కలుగుతున్నదని మంగళవారం ఆయన ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘30 ఏండ్లకుపైగా పోలీస్ అధికారిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ను చూస్తే హృదయం తరుక్కుపోతున్నది. ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్ కి వెళ్తే చెల్లదు అని పంపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారింది.
ఇది ఒక్క నారాయణ సింగ్ సమస్య మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా రిటైరయిన 8 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్మరణ సమస్య. సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి. వైద్యసేవలు పొందడంలో అంతరాయం కలగకుండా చూడాలి. ఈహెచ్ఎస్, పోలీస్, ఆరోగ్య భద్రత కార్డులు చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని హరీశ్ పేర్కొన్నారు.