రంగనాయక సాగర్ వద్ద భూమి కబ్జా చేయలే..కొన్న : హరీశ్ రావు

  • సీఎం ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడ

సంగారెడ్డి, వెలుగు: రంగనాయక సాగర్ దగ్గర తాను ఇరిగేషన్ భూముల ను కబ్జా చేసినట్లు రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.  రైతుల పాస్ బుక్కులు తీసుకొని, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి 13 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటిదాకా తాను ఎక్కడా గుంట భూమి కబ్జా చేయలేదని స్పషం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఫైర్ అయ్యారు. గురువారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాసానిపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మాణం చేపట్టిన పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా భయపడేది లేదని, రైతుల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు తెలిపారు. భూకబ్జాలు చేసిన చరిత్ర సీఎం రేవంత్ దేనని మండిపడ్డారు.తాను కొన్న భూమిలో సీఎం సమక్షంలోనే సర్వే చేస్తానని..ఎప్పుడు వస్తారో రేవంత్ చెప్పాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్​పై అక్రమ కేసులు పెడుతున్నారని హరీశ్​రావు పేర్కొన్నారు.