రేవంత్‌‌కు సీఎం పదవి కేసీఆర్‌‌‌‌ చలవే : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

రేవంత్‌‌కు సీఎం పదవి కేసీఆర్‌‌‌‌ చలవే : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

హైదరాబాద్, వెలుగు : ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నిజం చేసిన కేసీఆర్‌‌‌‌ను కొరివి దయ్యం అని సీఎం రేవంత్‌‌ రెడ్డి అంటున్నారని, ఉద్యమ ద్రోహులు తప్ప మరెవరూ ఇలా మాట్లాడరని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌ రావు మండిపడ్డారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కనుకే రేవంత్ సీఎం కాగలిగారని, ఆయనకు సీఎం పదవి కేసీఆర్ చలవేనని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా, నియామక పత్రాలు ఇవ్వడం కుదురుతుందా? అని ప్రశ్నించారు. డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ రేవంత్.. ఈ రోజు టీచర్లకు నీతి వచనాలు చెబుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు బిల్లా రంగాల గురించి బోధించమని టీచర్లకు చెబుతున్నావా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌‌‌‌ను జాబ్ లెస్ క్యాలెండర్‌‌‌‌గా మార్చారని మండిపడ్డారు.