తిహార్ జైలులో కవితతో హరీశ్ ములాఖత్

  • కవిత ఆరోగ్యంపై ఆరా

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఎమ్మెల్యే హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిహార్ జైలుకు వెళ్లి కవితను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఆరోగ్యంపై ఆరా తీశారు. కవిత కొంతకాలంగా అనారోగ్యం, దీర్ఘకాలికంగా గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో జులై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత న్యాయమూర్తి అనుమతితో కవిత భర్త అనిల్ నేతృత్వంలో ఢిల్లీ ఎయిమ్స్‌‌‌‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటి నుంచి కవిత జైలులోనే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. అయినప్పటికీ గురువారం మరోసారి ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో జైలు డాక్టర్ల సూచనల మేరకు కవితను ఎయిమ్స్‌‌‌‌కు తరలించారు.

ఆమె భర్త అనిల్ సమక్షంలో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు హరీశ్‌‌‌‌ రావు కవితతో ములాఖత్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి, వైద్య పరీక్షలు, జైలులో వసతులు, మందులు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.