రైతులను దగా చేసినందుకేనా విజయోత్సవాలు? : హరీశ్​ రావు

రైతులను దగా చేసినందుకేనా  విజయోత్సవాలు? : హరీశ్​ రావు
  • రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: ఏడాది పాలనలో రైతులను దగా చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అని సీఎం రేవంత్​ రెడ్డిని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​ రావు ప్రశ్నించారు. రైతు సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అందులో గత బీఆర్ఎస్​ ప్రభుత్వమే రూ.27,486 కోట్లు ఖర్చు చేసిందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు కాంగ్రెస్​ సర్కారు ఇంకా రూ.40,800 కోట్లు బాకీ పడిందని తెలిపారు. వాటితో పాటు ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసానూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 

రైతులకు ఏం చేశారని రైతు పండుగ పేరిట విజయోత్సవాలు చేస్తున్నారని నిలదీశారు. ‘‘వరంగల్​రైతు డిక్లరేషన్​లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నవా రేవంత్ రెడ్డి? రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడిపిస్తున్నందుకు చేస్తున్నవా? మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నవా?’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.