రుణమాఫీపై కాంగ్రెస్​ది మోసం : ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ

  హైదరాబాద్, వెలుగు: రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతులతోపాటు యావత్తు దేశాన్నీ తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాటను నిలబెట్టుకోలేదన్నారు.

‘‘పంద్రాగస్టు నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తానని లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీ పూర్తి చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆ తర్వాత ప్రకటించారు. కానీ సెప్టెంబర్ 25న నేను దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్బీఐ ఇచ్చిన సమాచారంతో రుణమాఫీ పూర్తికాలేదని తేలిపోయింది. రూ. లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5,74,137 కాగా, 2,99,445 మంది రైతుల రుణాలే మాఫీ అయ్యాయి.

రూ. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య 2,62,341 కాగా, ఇప్పటివరకు 1,30,915 మంది రైతులకే రుణమాఫీ అయింది. ఇక రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య 1,65,607 కాగా, ఇప్పటివరకు 65,231 మంది రైతులకే రుణమాఫీ పూర్తయినట్టు ఎస్బీఐ అందించిన డేటాతో వెల్లడైంది” అని హరీశ్ రావు పేర్కొన్నారు. దసరా పండుగ జరుపుకోవడానికి గ్రామాలకు వస్తున్న స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించాలని  ఎక్స్ లో హరీశ్‌‌ పిలుపునిచ్చారు. ‘‘ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. వీటితో పాటు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి”అని ఆయన కోరారు.