రేవంత్ పాలనపై ప్రజా తిరుగుబాటు : ఎమ్మెల్యే హరీశ్​రావు

  • దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు: హరీశ్​రావు
  • ఫార్మా సిటీపై సమాధానం చెప్పలేకనే కేటీఆర్​పై కుట్రలు
  • రిమాండ్ రిపోర్ట్​పై నరేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు. తమ భూములు తీసుకోవద్దంటూ రైతులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నా సీఎం రేవంత్​రెడ్డి పిలిచి మాట్లాడడం లేదని మండిపడ్డారు. లగచర్ల ఘటనలో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గురువారం ములాఖత్​లో హరీశ్ రావు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ ను గెలిపిస్తే బాగుపడతామని ఆశపడిన రైతుల నోట్లో ఆయన మట్టి కొట్టారని హరీశ్ రావు మండిపడ్డారు.

లగచర్ల గ్రామస్తులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని, కట్టుబట్టలతో ఊర్లు వదిలిపోయేలా చేశారని ఫైర్ అయ్యారు. ‘‘ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్​రెడ్డి తన బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్​కుట్రే అంటున్నారు. అశోక్​నగర్​లో విద్యార్థులు తిరగబడినా.. రైతులు రోడ్ల మీదకొచ్చినా.. పోలీసులు రోడ్డెక్కి ధర్నా చేసినా.. గురుకుల విద్యార్థులు నిరసన చేసినా.. బీఆర్ఎస్​ కుట్ర అంటూ కాంగ్రెస్​ నాయకులు మాట్లాడుతున్నారు. చివరకు సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు నిరసన చేసినా బీఆర్ఎస్​కుట్ర అంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వాళ్లకు అండగా ఉండడం మా బాధ్యత.. 

పోరాటాలు చేసే అన్ని వర్గాలకు అండగా ఉండడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని హరీశ్​రావు అన్నారు. ‘‘రేవంత్.. నువ్వు చేసే తప్పులు, నేరాలు, అక్రమాలకు చిడుతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా? మాకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదు. నన్నో, కేటీఆర్​నో, మా ఎమ్మెల్యేలనో అరెస్టు చేయండి. కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు. ఎన్ని రకాలుగా వేధించినా మీ మోసపూరిత వైఖరిపై బీఆర్ఎస్​పోరాటం ఎప్పుడూ ఆగదు.

ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్పినవ్. మరి.. ఇదేనా ప్రజాస్వామ్యం? మల్లన్నసాగర్​లో నువ్వు రెండ్రోజులు దీక్ష చేసినా రక్షణ ఇచ్చాం కదా. అడ్డుకోలేదు.. అరెస్ట్ చేయలేదు. కానీ, మా పార్టీ నేత మధుసూదనాచారి లగచర్లకు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్, కార్తీక్​రెడ్డి, ఎంపీ డీకే అరుణ వెళ్లినా అడ్డుకున్నారు. 9 నెలల గర్భిణి ఛాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు. ఇదేనా మీరు చేసే ప్రజాపాలన.. నిన్ను ప్రజలు గద్దె దించడం ఖాయం’’ అని అన్నారు. 

జవాబు చెప్పలేకనే కుట్రలు.. 

ఫార్మా సిటీపై సమాధానం చెప్పలేకనే కేటీఆర్​మీద కుట్రలు చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతు మీద కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ‘‘రిమాండ్​రిపోర్టులో ఏం రాశారో కూడా తెలియదని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. కేటీఆర్​ను ఈ కేసులో ఇరికించే కుట్రలకు తెరలేపారు. రిమాండ్​రిపోర్టు చదివేందుకూ అవకాశం ఇవ్వలేదు. బలవంతంగా నరేందర్​రెడ్డితో సంతకం పెట్టించారు. మెజిస్ట్రేట్​ముందు కూడా ఇదే విషయం చెప్పానని నరేందర్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్​కు బడా ఫార్మా కంపెనీలు, అల్లుడి మీద ఉన్న ప్రేమ.. రైతులు, గిరిజనులపై లేదు” అని అన్నారు.