- అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపుతరో కూడా చెప్పలేదు: హరీశ్ రావు
- సభను కనీసం 15 రోజులపాటు నడపాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ సమావేశం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసలు ఎన్ని రోజులు సభ నడుపుతరో కూడా బీఏసీలో చెప్పలేదని, కనీసం చర్చ కూడా చేయలేదని ఆయన విమర్శించారు. సోమవారం బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నడపాల్సిందిగా డిమాండ్ చేశామని, లగచర్ల అంశంపైనా చర్చించేందుకు పట్టుబట్టామని వెల్లడించారు.
.ఒకరోజు ప్రభుత్వానికి.. మరో రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం అని చెప్పారు. రైతుకు బేడీలు వేసిన అంశంపై చర్చించడం చాలా కీలకమని చెప్పారు. అయితే, బీఏసీకి కేవలం సూచన చేసే అధికారమే ఉంటుందని సీఎం రేవంత్ అనడం దారుణమన్నారు. బీఏసీ చెప్పినట్టే సభ నడవాలన్నారు. వివిధ అంశాలపై హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీఏసీపై తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ను ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల ప్రొటోకాల్ఉల్లంఘనలు జరగకుండా చూసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారన్నారు. బీఏసీ నిర్వహించకుండా సభలో బిల్లులు ఎలా పెడతారని హరీశ్‌రావు ప్రశ్నించారు. పుట్టిన రోజులు, పెళ్లిళ్లు ఉన్నాయని సభను వాయిదా వేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిరోజు జీరో అవర్ ఉండాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి ఉన్న సంఖ్యాబలం మేరకు మాట్లాడే సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరామన్నారు. తాము అదానీ, రేవంత్ భాయి భాయీ అన్న టీషర్టులు వేసుకొస్తే అడ్డుకున్నారని, కానీ, రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్‌కు అలాంటి టీషర్టులతో వెళ్లారని గుర్తు చేశారు. రాహుల్అలా అనుమతించినప్పుడు తమను మాత్రం అసెంబ్లీలో ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణ చరిత్రను చెరిపేసే కుట్ర
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం అనేది పేపర్ మీద చేసిన సంతకం కాదని.. కాలం మీద చేసిన సంతకమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే.. టీజీపీఎస్సీనా? లేక ఏపీపీఎస్సీ పరీక్షనా? అనే అనుమానం కలుగుతున్నదని విమర్శించారు. క్వొశ్చన్ పేపర్లో వచ్చిన ప్రశ్నలపై ఆయన సోమవారం ట్విటర్లో స్పందించారు.
‘‘2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.. రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏంటో గుర్తించండి? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా? కాదా? అనేవి గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలు.
తెలంగాణ మలిదశ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. తగిన బుద్ధి చెప్తది’’అని సీఎం రేవంత్‌పై హరీశ్ మండిపడ్డారు.