- మహబూబాబాద్ ముఖ్యనేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావ్
- బీఆర్ఎస్ సమావేశాలకు దూరం దూరం
భద్రాద్రి కొత్తగూడెం/ మహబూబాబాద్, వెలుగు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కు హాజరై బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. వీళ్లతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కూడా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.
బీఆర్ఎస్ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెల్లం వెంకట్రావ్మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. కొన్నిరోజులుగా బీఆర్ఎస్పార్టీ కార్యక్రమాలకు, పార్లమెంట్‌స్థాయి రివ్యూ మీటింగులకు దూరంగా ఉంటున్నారు. దీంతో తెల్లం వెంకట్రావ్ పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతున్నది.