అసెంబ్లీలో రచ్చ! .. స్పీకర్​తో మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి వాగ్వాదం

అసెంబ్లీలో రచ్చ! .. స్పీకర్​తో మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి వాగ్వాదం
  • సభ మీ సొంతం కాదని కామెంట్
  • మండి పడ్డ కాంగ్రెస్ సభ్యులు.. సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు
  • అనర్హత వేటుపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన
  • ఉత్తమ్, సీతక్క, విప్​ల ఆగ్రహం
  • చర్యలు తీసుకోవాలంటూ వెల్​లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు
  • ఈ సెషన్ మొత్తం జగదీశ్​రెడ్డిని సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ ​ప్రకటన
  • నిరసనగా బీఆర్ఎస్​ సభ్యుల వాకౌట్

 హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చ రచ్చగా మారింది. స్పీకర్​తో మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొన్నది. సభా మర్యాదలు పాటించాలంటూ స్పీకర్ సూచించడం.. ​ దీనికి కౌంటర్​గా ‘ఈ సభ అందరిది, మీ సొంతమేం కాదు..’ అంటూ జగదీశ్ రెట్టించడంతో సభ ఒక్కసారిగా అదుపు తప్పింది. 

అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్​ అయ్యారు.  ఏకవచనంతో దళిత స్పీకర్​ను జగదీశ్​అవమానపరిచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని నినదిస్తూ వెల్​లోకి దూసుకొచ్చారు. ఈ గందరగోళంలో  ఉదయం11.45 గంటలకు  సభను స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి ప్రారంభమయ్యాక సభా మర్యాదల అంశంపైనే చర్చ కొనసాగింది. 

స్పీకర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్‌రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించగా,  శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  సూచించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్‌ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిఫార్సు చేశారు. బడ్జెట్‌ సెషన్స్‌ ముగిసే వరకు జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్​ ఆమోదం తెలిపారు. 

అసెంబ్లీ నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌ రెడ్డిని సస్పెండ్‌‌‌‌ చేస్తున్నట్టు స్పీకర్‌‌‌‌ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్‌‌‌‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌‌‌‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి సభ నుంచి వెళ్లిపోవడంతో నిరసనగా బీఆర్ఎస్​ సభ్యులు వాకౌట్​చేశారు.  

స్పీకర్​ఒక పెద్ద మనిషి మాత్రమే: జగదీశ్​రెడ్డి

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  బీఆర్ఎస్ తరఫున చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి.. కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు వేస్తూ మాట్లాడారు. ప్రభుత్వం హామీలేవీ అమలుచేయకుండానే చేసినట్టు చెబుతోందంటూ ఓ పిట్ట కథ చెప్పారు. రుణమాఫీ చేయకున్నా.. రైతుబంధు ఇయ్యకున్నా.. ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 

గవర్నర్​తో 36 నిమిషాల్లో 360 అబద్ధాలు మాట్లాడించారని, దీనికి గవర్నర్​ మనసు ఎంత గింజుకుందో అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుపడి.. జగదీశ్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని, తాము రుణమాఫీ చేసినా చేయనట్టు ఎలా చెప్తారని నిలదీశారు. 

కేసీఆర్​ పదేండ్ల కాలంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో కూడా జగదీశ్​ చెప్తే బాగుంటుందని అన్నారు.  దళితులకు 3 ఎకరాలు ఇస్తామని ఇవ్వలేదని, దళిత ముఖ్యమంత్రిపైనా మాట మార్చారని మండిపడ్డారు. ఆ సమయంలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకొని సభ సజావుగా సాగేలా చూడాలని స్పీకర్​ను కోరారు. 

మరోసారి అవకాశం ఇచ్చినా..

మరోసారి జగదీశ్​రెడ్డికి స్పీకర్​ అవకాశం ఇవ్వగా, ఆయన మళ్లీ హామీల అమలు గురించే మాట్లాడారు. ‘‘నా నియోజకవర్గంలోని రైతులు వెంకట్రామయ్య, రాజన్న, రవినాయక్​ నన్ను కలిసి రుణమాఫీ కాలేదని,  రైతు భరోసా రాలేదని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 ఇచ్చారా? స్కూటీలు వచ్చాయా?’’ అంటూ జగదీశ్​రెడ్డి వాయిస్​ పెంచారు. ఈ క్రమంలో స్పీకర్​  జోక్యం చేసుకొని ‘‘మీకు మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చినా మీరు అసహనానికి గురికాకండి. మీరు సహనంతో మాట్లాడండి. 

సీనియర్​ శాసనసభ్యులుగా, మాజీ మంత్రిగా సభా సంప్రదాయాలు కాపాడండి’’ అని సూచించారు.  తాను ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో  చెప్పాలని స్పీకర్​ను ఉద్దేశించి  జగదీశ్​రెడ్డి అన్నారు. దీనికి స్పీకర్..​ తనను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పగా,   జగదీశ్​రెడ్డి రెట్టించారు. ‘‘ఈ సభ అందరిది. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అందరి తరఫున పెద్ద మనిషిగా మీరు (స్పీకర్‌‌‌‌) కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని కామెంట్​చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొన్నది.  

మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకొని జగదీశ్​రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.   జగదీశ్​రెడ్డి స్పీకర్​ను  బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు.  చైర్​పై దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ క్రమంలో జగదీశ్​రెడ్డికి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతుగా నిలిచారు. 

జగదీశ్​రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. మరోవైపు జగదీశ్​రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని, ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్​ సభ్యులు డిమాండ్ చేశారు.  ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది.  ఇరువురు సభ్యులు పోడియం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో స్పీకర్  సభను వాయిదా వేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉంది: డిప్యూటీ సీఎం

బ్రేక్ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా.. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్​, విప్ రాంచంద్రునాయక్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.  జగదీశ్​ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్  గడ్డం ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగదీశ్​రెడ్డిని ఈ సెషన్ మొత్తం పూర్తిగా సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్​చేశారు. 

ఆయన  వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసి, వారి నిర్ణయం మేరకు తర్వాత  చర్యలు తీసుకోవాలని  స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని భట్టి అన్నారు.  జగదీశ్​రెడ్డి సంస్కారం చూస్తుంటే బాధగా ఉందని,  ఆయన వ్యాఖ్యలను సభలో సభ్యులమంతా  ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యానికి  అసెంబ్లీ దేవాలయం లాంటిదని, అలాంటి సభను సజావుగా నడిపించడానికి  రాజ్యాంగం స్పీకర్ కు విశేష అధికారాలు ఇచ్చిందని భట్టి  చెప్పారు‌‌‌‌. 

ఉమ్మడి  రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గురించి ఒక సభ్యుడు శాసనసభ బయట  అనుచిత వ్యాఖ్యలు చేస్తే  ఆనాడు ఎథిక్స్ కమిటీకి పంపించిన విషయాన్ని  గుర్తు చేశారు. 2014 లో అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సంపత్ కుమార్  సభ్యత్వాన్ని రద్దు చేసిందన్నారు.  

సభా సంప్రదాయాలు కాపాడడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం  ఉందని వ్యాఖ్యానించారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ప్రకారం జగదీశ్​రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొంత మంది సభ్యులు కోరినట్టు భట్టి  చెప్పారు. కానీ తమకు ప్రజాస్వామ్యం, సభా సంప్రదాయాల పైన గౌరవం ఉంది కాబట్టి ఈ సెషన్ మొత్తం పూర్తిగా సస్పెండ్ చేయాలని, అదే విధంగా సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి పంపి, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 సభలో స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడం, హేళనగా మాట్లాడడం సభకు శోభను తీసుకురాదని పేర్కొన్నారు.  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు అవహేళనగా మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అని అన్నారు. 

 హౌస్​లో స్పీకరే సుప్రీం: మంత్రి ఉత్తమ్​

అసెంబ్లీలో జగదీశ్​ రెడ్డి స్పీచ్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.  పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకరే సుప్రీం అని అన్నారు. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమేనని పేర్కొన్నారు. స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ ఉండదని  స్పష్టం చేశారు. 

దళిత జాతికి చెందిన సీనియర్ నేత, స్పీకర్ హోదాలో ఉన్న అటువంటి వ్యక్తి పై చేసిన వ్యాఖ్యలు జగదీశ్​రెడ్డి అహంకార ధోరణిని బయట పెట్టినట్లయిందని తెలిపారు. ఈ తరహాలో ఏ సభ్యుడు మాట్లాడినా ఊపేక్షింది లేదని  పేర్కొన్నారు.  ఈ అంశాన్ని శాసనసభ ఎథిక్స్ కమిటీకి పంపాలని  సూచించారు. 

స్పీకర్ పై  ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత  జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రి సీతక్క అన్నారు. జగదీశ్​రెడ్డి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చాలా అవమానాలు ఎదుర్కొన్నామని, వాళ్లు (బీఆర్ఎస్​) అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు వర్గాలను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. ఏక వచనంలో స్పీకర్ చైర్ ను  అవమానించారని మండిపడ్డారు.  

గవర్నర్ ను కాంగ్రెస్ కార్యకర్తగా పిలిచి అవమానించారని, అప్పుడు మహిళా గవర్నర్, ఇటీవల  ట్రైబల్ గవర్నర్, ఇప్పుడు స్పీకర్ ను అవమానించారని సీతక్క అన్నారు. బీఆర్ఎస్  అధికారంలో ఉన్నప్పుడు అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారని,  గతంలో తమను పోడియం వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. దళిత వర్గాలకు చెందిన స్పీకర్ ను టార్గెట్ చేయడం మంచిది కాదని సీతక్క అన్నారు. 

బీఆర్ఎస్​ సభ్యుల వాకౌట్​

మంత్రి శ్రీధర్​బాబు ప్రతిపాదనల మేరకు  అసెంబ్లీ నుంచి సస్పెండ్‌‌‌‌ చేస్తున్నట్టు స్పీకర్‌‌‌‌గడ్డం ప్రసాద్ కుమార్​ ప్రకటించినా.. జగదీశ్​రెడ్డి తన సీట్లోంచి కదలలేదు. ఆ తర్వాత లాబీ లోని  బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి కూర్చొన్నారు. అక్కడికి చీఫ్ మార్షల్ వచ్చి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ.. జగదీశ్​రెడ్డి నిరాకరించారు.  పక్కనే ఉన్న ఎమ్మెల్యే కేటీఆర్ కూడా మార్షల్​తో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత అసెంబ్లీ నుంచి జగదీశ్​ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఆ వెంటనే సభలోంచి బీఆర్ఎస్​ సభ్యులు వాకౌట్​చేశారు.​

స్పీకర్ ను ప్రశ్నించే అధికారం లేదు: మంత్రి శ్రీధర్​బాబు

అసెంబ్లీ లో ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడటం సరికాదని, నిబంధ‌‌‌‌న‌‌‌‌ల ప్రకారం ఏ స‌‌‌‌భ్యుడు కూడా బ‌‌‌‌యట లేదా లోప‌‌‌‌ల స్పీక‌‌‌‌ర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌‌‌‌కూడ‌‌‌‌దని తెలిపారు.  

స్పీక‌‌‌‌ర్ చ‌‌‌‌ర్యలు, అధికారాలను ప్రశ్నించే అధికారం ఏ స‌‌‌‌భ్యుడికీ  లేదని చెప్పారు. స‌‌‌‌భను న‌‌‌‌డువ‌‌‌‌నీయొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ స‌‌‌‌భ్యులు స‌‌‌‌భ‌‌‌‌కు వ‌‌‌‌చ్చిన‌‌‌‌ట్లుగా అనిపిస్తున్నదని అన్నారు.  స‌‌‌‌భా గౌర‌‌‌‌వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, స‌‌‌‌భ్యులంద‌‌‌‌రి  కోరిక మేర‌‌‌‌కు  జ‌‌‌‌గ‌‌‌‌దీశ్​ రెడ్డి ని ఈ సెష‌‌‌‌న్ ముగిసే వ‌‌‌‌ర‌‌‌‌కు స‌‌‌‌స్పెండ్ చేయాల‌‌‌‌ని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.