కాంగ్రెస్ అంటేనే.. కేసులు, లాఠీచార్జీలు : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ అంటేనే.. కేసులు, లాఠీచార్జీలు : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అంటేనే కేసులు, లాఠీచార్జీలు అని విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను పెయిడ్ బ్యాచ్ అంటూ మంత్రులు అవమానకరంగా మాట్లాడారని, కానీ అసలు పెయిడ్​ బ్యాచ్ సీఎం, మంత్రులేనని విమర్శించారు. పీసీసీ, సీఎం, మంత్రి పదవులన్నీ పేమెంట్​తోనే వస్తున్నాయని ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం మంత్రి పదవులు పొందినవాళ్లంతా పేమెంట్లతోనే పొందారని ఆరోపించారు. దీనిపై మాట్లాడినవాళ్లంతా గుంటనక్కలేనడం దారుణమన్నారు. 

ఉమ్మడి ఏపీలో హెచ్​సీయూ భూములను ప్రైవేటోళ్లకు ఇచ్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డంపడుతున్నాయని నాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు బాటలోనే రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు. హెచ్​సీయూ భూములపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయన్నారు.