కల్చరల్ ప్రోగ్రామ్ పేరిట సినిమా పాటలేంది.. విజయోత్సవాలపై జగదీశ్​ రెడ్డి ఫైర్

కల్చరల్ ప్రోగ్రామ్ పేరిట సినిమా పాటలేంది.. విజయోత్సవాలపై జగదీశ్​ రెడ్డి ఫైర్
  • విజయోత్సవాల్లో సంస్కృతిని మంటగలిపారు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఏడాది పాలన విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతిని మంటగలిపారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సినిమా పాటలు పాడించారన్నారు. తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్​లో ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్​ రెడ్డి, ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ భాష, యాసను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారని, నాడు తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించే స్థాయికి వెళ్లారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టిందని తెలిపారు. ఆ తల్లి దేవతామూర్తిలా ఉండి ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ తల్లి పేరుతో ఏ రూపాన్ని ప్రతిష్టించారో అందరికీ తెలుసన్నారు. 

తెలంగాణ తల్లిని చంపుతామని తుపాకీ పట్టుకుని బయల్దేరినవాళ్లే నేడు కొత్త తల్లిని తీసుకొచ్చారని విమర్శించారు. కిరాయి రాతగాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్​నే సీఎం చదివారని మండిపడ్డారు. ఇది తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న భయంకరమైన దాడి అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు పాడారని ఫైర్ అయ్యారు. సమైక్యవాదులు 80 ఏండ్ల కిందట పన్నిన కుట్ర మళ్లీ ఇప్పుడు మొదలైందని జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు.