- సమస్యలపై కొట్లాడుతూనే ఉంటం : జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్‌ను జైల్లో పెట్టినా రైతు సమస్యలపై కొట్లాట ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్‌ను జైల్లో పెట్టినా తెలంగాణ ఉద్యమం ఆగలేదన్నారు. జైల్లో పెడ్తామని పదేండ్ల నుంచి బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు అంటున్నారని, ఇలాంటి తొండ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏదైనా తప్పు చేస్తే కేసులు పెట్టాల్సింది, అరెస్ట్ చేయాల్సింది పోలీసులు అని, జైల్లో పెట్టే హక్కు కాంగ్రెస్ లీడర్లకు ఎక్కడిదని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఏమైనా పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారా?
లేకపోతే పరిపాలన చేస్తున్నారా? అని నిలదీశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న వారి బాసులతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. హనుమంతుడి ముందే కుప్పిగంతులా? రేవంత్ బాస్ మోదీ కూడా కేసీఆర్‌ను జైల్లో వేస్తామని వందల సార్లు అన్నరు. తాగునీరు, సాగునీరు అడిగితే జైల్లో పెడ్తరా? జైల్లో పెట్టడానికి మీరెవరు? మేం పదేండ్లు రాష్ట్రాన్ని పాలించినం. ఒక్కసారి కూడా జైలుకు పంపుతం.. కేసులు పెడ్తం అని ఎవరినీ అన్లేదు’’అని అన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.
ఫిరాయింపుల చట్టం గురించి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్ని పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.