- అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు
- కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కు సంజయ్ ఫిర్యాదు
- రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ
కరీంనగర్ / కరీంనగర్ క్రైం/జూబ్లీహిల్స్ / హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని ఓ టీవీ చానెల్ డిబేట్లో పాల్గొని వస్తుండగా హైదరాబాద్ లాఅండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగాన్ని కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. దుర్భాషలాడడంతోపాటు సంజయ్‌పై దాడికి యత్నించారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను గల్లా పట్టి అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆటంకం కలిగించారు.
దీనిపై తమ ఎమ్మెల్యేపై దాడి చేశారని, నిండు సభలో పరుష పదజాలం వాడారని సంజయ్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సంజయ్ హైదరాబాద్‌లలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సత్తు మల్లేశం, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ కూడా కంప్లైంట్ చేశారు. మరోవైపు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ వన్‌టౌన్‌పోలీసులు కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం సుమారు 30 మంది పోలీసు అధికారులు హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ బయల్దేరారు. రాత్రి 11 గంటల టైంలో కరీంనగర్‌లోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల కోసం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో టెస్ట్ కిట్లను స్టేషన్‌కే తరలించారు.
నాపై దాడికి యత్నించాడు: సంజయ్
కౌశిక్‌రెడ్డి దురుసు ప్రవర్తనపై పీఏతో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించిన ఎమ్మెల్యే సంజయ్.. సోమవారం తన స్టేట్మెంట్ రికార్డు కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సమావేశంలో కౌశిక్ రెడ్డి తనపై మాటలతో, చేతులతో దాడి చేశాడని పోలీసులకు తెలిపారు. తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, జమ్మికుంట తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన కేసులు ఉన్నాయని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. గతంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్లని రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి కూడా అనేక పార్టీలు మారి బీఆర్ఎస్ లో చేరాడని, ఆయనపై ఎమ్మెల్యే కాకముందే అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే వీళ్లకు ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డియే కావాలని దాడి చేశాడా? ఎవరైనా చేయించారా అనే విషయం తెలియదన్నారు. గంగుల కమాలాకర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు కాదన్నారు.
కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సోమవారం స్పీకర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే అడ్డుకున్నారని, దుర్బషలాడారని సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సంజయ్ ఫిర్యాదుపై స్పీకర్ స్పందిస్తూ పోలీసుల దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.