100 రోజులుగా జైల్లోనే కవిత.. ఇప్పటిదాకా కలువని కేసీఆర్​

100 రోజులుగా జైల్లోనే కవిత.. ఇప్పటిదాకా కలువని కేసీఆర్​
  • మార్చి 15న హైదరాబాద్​లో అరెస్ట్ చేసిన ఈడీ
  • ఏప్రిల్ 11న అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ
  • అరెస్టయిన తొలినాళ్లలో బీఆర్​ఎస్​హడావుడి.. ఆ తర్వాత గప్​చుప్​

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి వంద రోజులు గడిచింది. ఈ వంద రోజులుగా ఆమె తీహార్‌‌‌‌ జైల్లోనే ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆఫీసర్లు.. అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్‌‌ చేసి స్పెషల్ ఫ్లైట్‌‌లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో హాజరు పర్చగా.. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో కవిత తరఫు లాయర్లు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 

కానీ.. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తూ, ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌‌లో సీబీఐ ఎంటరైంది. తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరు పరుస్తూ.. లిక్కర్ స్కామ్‌‌లో కవితనే సూత్రధారి అని కోర్టుకు ఇచ్చిన కస్టడీ అప్లికేషన్‌‌లో సీబీఐ పేర్కొంది. కవితను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈడీ, సీబీఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. చివరిగా ఈ నెల 21న కేసును విచారించిన కోర్టు.. సీబీఐ కేసులో జులై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఈడీ కేసులో జులై 3న విచారణ చేపట్టనుంది. ఇక ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

బీఆర్ఎస్​ సైలెంట్​!

కవిత అరెస్ట్ సమయంలో బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు హడావుడి చేశారు. అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటూ ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే.. లోపలికి దూసుకెళ్లిన ఆమె అన్న కేటీఆర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర, రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్‌‌లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి నాడే కేటీఆర్, హరీశ్‌‌రావు మరికొంత మంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కవితకు బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ, బెయిల్ రాలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. వారం, పది రోజుల తర్వాత కవిత అరెస్ట్ గురించి మాట్లాడడం మానేశారు. 

బిడ్డను చూడని తండ్రి

తీహార్​ జైల్లో ఉన్న కవితను కేటీఆర్, హరీశ్‌‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు. తల్లి శోభ కూడా జైలుకు వెళ్లి కవితను కలిశారు. కానీ, కవిత తండ్రి, బీఆర్‌‌‌‌ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ ఆమెను కలవడానికి వెళ్లలేదు. కవిత అరెస్ట్ తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేజ్రీవాల్‌‌ను, ఇతర నాయకులను అరెస్ట్ చేశారని.. ఆయనను విడుదల చేయాలని అందులో ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్‌‌లో తనపై కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకుడు బీఎల్‌‌ సంతోష్‌‌పై కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినందునే, వాళ్లు కవితను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.