రేవంత్ సర్కారును పడగొట్టేందుకు సుపారీ..! తెలంగాణ పాలిటిక్స్‎లో ‘కొత్త’ దుమారం

రేవంత్ సర్కారును పడగొట్టేందుకు సుపారీ..! తెలంగాణ పాలిటిక్స్‎లో ‘కొత్త’ దుమారం
  • పాలిటిక్స్ లో  ‘కొత్త’ దుమారం  
  • హాట్ టాపిక్ గా దుబ్బాక ఎమ్మెల్యే వ్యాఖ్యలు
  • కొత్త కామెంట్స్ పై  మంత్రుల ఆగ్రహం
  • ఆ మాటల వెనుక కేసీఆర్ ఉన్నారని విమర్శలు

హైదరాబాద్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ నిన్న దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‎గా మారాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు డబ్బుల అంశాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. అయితే కొత్త  ప్రభాకర్ రెడ్డి మాత్రం వ్యాపారులు డబ్బలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్ర జరుగుతోందా..? అన్న చర్చ మొదలైంది. 

అప్పుడు జాతర.. ఇప్పుడు పాతర

ఫిరాయింపులను ప్రోత్సహించటంలో కేసీఆర్‎కు ఘన చరిత్రే ఉంది. పదేండ్లు అధికారంలో ఉన్నపుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి ఒత్తిడి పెట్టి ఏదో  ఒక రూపంలో బీఆర్ఎస్‎లోకి లాక్కున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తాము అధికారంలో ఉన్నపుడు ఎలాంటి పనులుచేసినా చట్టబద్దమే, అంతా న్యాయబద్దంగా చేసినట్లేనని, అదేపనిని తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పార్టీ చేస్తే రాజ్యాంగవిరుద్ధం, చట్టవ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి పాతర అనే విషయాలు గుర్తుకొస్తాయనే విమర్శలున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరినప్పుడు జాతర చేసుకున్న గులాబీ నేతలు.. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి పాతరంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. 

ఎమ్మెల్యేలను కొంటరా..?

కొత్త  ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం కేవలం 28 మాత్రమే. అధికారంలోకి రావాలంటే ఇంకా 33 మంది ఎమ్మెల్యేలు కావాలి. ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు కాదా.. కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపోయేంత బలం కూడా లేదనేది నిష్టుర సత్యం. కానీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, విప్ ఆది  శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాత్రం ఈ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి సారి డబ్బుల అంశం తెరపైకి రావడం కొత్త దుమారంగా  మారింది