మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతులు యాచించాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా రైతు భరోసా కింద రైతులకు ఇవ్వలేదని.. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని అన్నారు కేటీఆర్. తమ ప్రభుత్వ హయాంలో 11సార్లు రైతుబంధు వేశాక మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్.
ప్రభుత్వానికి దమ్ముంటే రుణమాఫీ, బోనస్ లెక్కలు బయటపెట్టాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రమాణపత్రాలు,దరఖాస్తులు అనే పనికిమాలిన మాటలు ఆపేయాలని అన్నారు. రేపటి నుంచి ( జనవరి 4, 2025 ) ఎక్కడిక్కడ పోరాటాలు చేస్తామని అన్నారు. రైతుబంధు కేసీఆర్ మానసపుత్రిక అని.. ఈ పథకానికి బొంద పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్.
ALSO READ | హైదరాబాద్ ఐఐఐటీ ... సింగరేణితో ఒప్పందం చేసుకుంది..
ప్రభుత్వం మెడలు వంచి రైతుబంధు ఇప్పిస్తామని, ప్రభుత్వం బుద్ధి తప్పుడు ఆలోచనలు మానుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు కేటీఆర్. 22లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతోందని.. 22 లక్షల మంది కౌలు రైతులకు ఎప్పటినుంచి రైతు భరోసా ఇస్తారో చెప్పాలని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దమ్ము ఉంటే ప్రతి గ్రామంలో లెక్కలు చెప్పాలని.. ఏ ఊర్లో ఎంత రైతు బంధు దుర్వినియోగం అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.